logo

Gas Cylinder: గ్యాస్‌ రాయితీ.. అమలుపై గందరగోళం

గ్యాస్‌ రాయితీ పథకం అమలు విధివిధానాలపై నగరవాసుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు పెట్టకపోయినా ప్రచారాన్ని నమ్ముతున్న లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Updated : 17 Dec 2023 07:09 IST

కేవైసీ కోసం ఏజెన్సీల ముందు జనం బారులు
విధివిధానాలపై తలోమాట

ఈనాడు, హైదరాబాద్‌: గ్యాస్‌ రాయితీ (Gas Cylinder) పథకం అమలు విధివిధానాలపై నగరవాసుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు పెట్టకపోయినా ప్రచారాన్ని నమ్ముతున్న లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ పూర్తిచేయాలని గడువు విధించిందనే ప్రచారంతో ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు. మరికొందరు తమ ఖాతాలను మహిళల పేరున మార్చాలని కోరుతున్నారు. వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పినా వినే పరిస్థితి లేదని సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్న తరుణంలో వీరందరి ‘నో యువర్‌ కస్టమర్‌’ వివరాలు నమోదు చేయడం సవాల్‌గా మారింది.

యాప్‌ల ద్వారా వెసులుబాటున్నా...

వినియోగదారులు సొంతంగానే కేవైసీ అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు ఉన్నా వారికీ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. ప్లేస్టోర్‌లో హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌, ఇండేన్‌ తదితర చమురు సంస్థల ఆండ్రాయిడ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న కొందరు అప్‌డేట్‌ సమయంలో ఎర్రర్‌ వస్తోందని ఫిర్యాదు చేస్తున్నారు. సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఇవే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మరికొందరు పోస్టు చేస్తున్నారు. డెలివరీ బాయ్‌లకే ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా అప్‌డేట్‌ చేసే సౌకర్యం కల్పించినా..సాంకేతిక సమస్యలు తప్పడం లేదు.

నిబంధనలపై ప్రచారం...: మహిళల పేరుమీద ఉన్న ఖాతాలకే గ్యాస్‌ రాయితీ పథకం వర్తిస్తుందంటూ ప్రచారం సాగుతుండటంతో అనేక మంది తమ కనెక్షన్లను భార్య పేరున మార్చాలని కోరుతున్నారని ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ కుటుంబం మొత్తం వాడుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి కుటుంబాలందరికీ పథకం వర్తించేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నట్లు వెల్లడించారు.

రాయితీ గ్యాస్‌ కోసం ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ ఏజెన్సీకి వచ్చి ఆరా తీస్తున్న వినియోగదారులు


అప్‌డేట్‌ ఎలా చేసుకోవాలి..

తొలుత https://www.mylpg.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మూడు గ్యాస్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలు ప్రత్యమవుతాయి. ఏ కనెక్షన్‌ వాడుతున్నారో ఆ సంస్థ సిలిండర్‌ గుర్తును ఎంపిక చేయాలి. కేవైసీ అప్‌డేట్‌ అయిందా లేదా ముందు పరిశీలించుకోవాలి. ఇందుకోసం తొలుత సైనప్‌ ద్వారా వివరాలు నింపి రిజిస్టర్‌ అవ్వాలి. తర్వాత ఓటీపీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అయ్యి ‘వ్యూ డిటెయిల్స్‌’ను ఎంపిక చేస్తే ఖాతాదారు పూర్తి వివరాలు కనిపిస్తాయి. అందులో కేవైసీ అప్‌డేట్‌ చేశారా.. లేదా అన్న విషయం స్పష్టమవుతుంది. కేవైసీ అప్‌డేట్‌ లేకపోతే లాగిన్‌ అయ్యాక ‘నీడ్‌ కేవైసీ’ ఎంపిక చేసుకోవాలి. తర్వాత కనిపించే దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేసి ఏజెన్సీలో ఇస్తే బయోమెట్రిక్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు