logo

Hyderabad: ఎలివేటెడ్‌ కారిడార్‌.. పుష్కరం క్రితమే కట్టాలనుకున్నా..

ప్యారడైజ్‌ కూడలి నుంచి డెయిరీ ఫాం రోడ్డు వరకు దూరం తక్కువే అయినా కంటోన్మెంట్‌లో ఇరుకుదారులతో నిత్యం ట్రాఫిక్‌ కష్టాలే. దీన్నుంచి బయటపడేందుకు ఈ మార్గంలో 4.650 కి.మీ.

Updated : 15 Mar 2024 07:58 IST

పైవంతెనలు కూల్చడం ఇష్టం లేక.. పక్క నుంచి మెట్రో వేశారు
రాబోయే అతిపెద్ద డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ మనదే

నాగ్‌పుర్‌ మెట్రో

ఈనాడు, హైదరాబాద్‌: ప్యారడైజ్‌ కూడలి నుంచి డెయిరీ ఫాం రోడ్డు వరకు దూరం తక్కువే అయినా కంటోన్మెంట్‌లో ఇరుకుదారులతో నిత్యం ట్రాఫిక్‌ కష్టాలే. దీన్నుంచి బయటపడేందుకు ఈ మార్గంలో 4.650 కి.మీ. పొడవునా డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఇటీవల సర్కారు శంకుస్థాపన చేసింది. ఇది పూర్తైతే దేశంలోనే అతిపెద్ద డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ మనదే అవుతుంది. మొదటి డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నాగ్‌పుర్‌లో నిర్మించారు. వార్దా రోడ్‌లో 3.14 కి.మీ. దూరం వేశారు. మొదటి అంతస్తులో రహదారి, ఆపై రెండో అంతస్తులో మెట్రో కోసం కట్టారు. 3 స్టేషన్లున్నాయి. అప్పట్లో ఇది గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించినా..

మెట్రో మొదటిదశలో ప్యారడైజ్‌ నుంచి ప్యాట్నీ వరకు ఉన్న ఫ్లైఓవర్లను తొలగించి వాటి స్థానంలో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ను పుష్కరకాలం క్రితమే ప్రతిపాదించారు. ఈ మార్గంలో రెండే లేన్లతో ఇరుకుగా ఉన్నాయి. వీటి తొలగించి ఆరు లేన్లతో రహదారి, ఆపైన మెట్రో వేయాలనే మెట్రో అధికారులు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఫ్లైఓవర్లను కూల్చకుండానే పక్క నుంచి వేయాలని సూచించడంతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ కార్యరూపం దాల్చలేదు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చొరవతో నాగ్‌పుర్‌లో మొదటిది నిర్మించారు. నగరాల్లో జాతీయ రహదారులపై ఎక్కడ పైవంతెనలు నిర్మించే ఆలోచన ఉన్నా.. అక్కడ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తాజాగా ప్యారడైజ్‌ కారిడార్‌ పూర్తిచేస్తే తర్వాత హయత్‌నగర్‌, పటాన్‌చెరు మార్గాల్లోనూ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లు వచ్చే అవకాశం ఉంది.


తగ్గనున్న నిర్మాణ వ్యయం

ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఒకే మార్గంలో ఫ్లైఓవర్లు, మెట్రో నిర్మాణాలు అనివార్యమవుతున్నాయి. తొలుత పైవంతెన నిర్మించాక అక్కడ మెట్రో వేయాలంటే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. డివైడర్‌ ప్రాంతంలో కాకుండా కాలిబాటలో మెట్రో స్తంభాలు నిర్మించాలి. అప్పుడు భవనాల పక్క నుంచే మెట్రో వెళ్లడం భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్నిచోట్ల ఆస్తులను సేకరించాల్సి వస్తోంది. ఇవన్నీ వ్యయం పెరిగేందుకు కారణం అవుతుంది. డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించుకుంటే ఒకేసారి స్తంభాల పనులను పూర్తిచేయవచ్చు. దీంతో వ్యయం చాలా తగ్గుతుంది. రహదారులు, మెట్రోను ఏకకాలంలో పూర్తిచేయవచ్చు. లేదంటే మొదట రహదారి పూర్తిచేసి అవసరాన్నిబట్టి మెట్రో నిర్మించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని