logo

అసెంబ్లీ బలాలు అక్కరకొచ్చేనా?

నగరంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో నేతలు పార్టీలు మారడం జోరందుకుంది.

Published : 20 Mar 2024 03:01 IST

నగరంలో జోరందుకున్న వలసలు
వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో నేతలు పార్టీలు మారడం జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రానున్న సార్వత్రిక పోరుకు పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి.

రాజధాని పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో భారాస 17 అసెంబ్లీ స్థానాలను గెల్చుకోగా.. ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 3, భాజపా ఒక స్థానంలో గెలుపొందింది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఈ బలాల్లోనూ మార్పులు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఇలా..

  • సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆరు భారాస, ఒకటి ఎంఐఎం గెల్చుకున్నాయి. ఇక్కడ భారాసకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో సమీకరణాలు మారాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్‌ నుంచి భాజపా తరఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌, భారాస బలమైన అభ్యర్థులను బరిలో దించే పనిలో ఉన్నాయి.
  • మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడింటిని భారాస కైవసం చేసుకుంది. స్పష్టమైన ఆధిక్యం భారాసకు లభించింది. ఈ ఎంపీ స్థానంపై భారాసకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. సిట్టింగ్‌ స్థానం కాబట్టి అధికార కాంగ్రెస్‌ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడింది. భాజపా తరఫున ఈటల బరిలో ఉన్నారు. మోదీ హవా, ఉత్తరాది, సెటిలర్ల ఓట్లతో గెలుపొందుతామనే ధీమాలో ఆ పార్టీ ఉంది.
  • చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. భారాస 4, కాంగ్రెస్‌ 3 గెల్చుకున్నాయి. ఇక్కడ భారాసకు ఆధిక్యం ఉన్నా... ఓట్ల వ్యత్యాసం లక్ష దాకా మాత్రమే ఉంది.  సిట్టింగ్‌ ఎమ్మెల్యే రంజిత్‌రెడ్డి ఆపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో బలాబలాలు మారుతున్నాయి. ఇక్కడి నుంచి భారాస తరఫున ఈసారి కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ చేస్తుండగా.. భాజపా నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన గతసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు.
  • హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆరు ఎంఐఎం, ఒకటి భాజపా గెలుపొందాయి. ఇక్కడ ఎంఐఎంకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఎలాగైనా నిలువరించాలని భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అసదుద్దీన్‌కు పోటీగా మాధవీలతను బరిలో దింపింది. కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని