logo

శ్రమశక్తిని అధిగమిస్తున్న కృత్రిమ మేధ

కృత్రిమ మేధ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సహా అన్ని రంగాల్లో మన శ్రమశక్తిని అధిగమిస్తోందని సైయంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 27 Mar 2024 01:06 IST

ఈనాడు, హైదరాబాద్‌-గచ్చిబౌలి, న్యూస్‌టుడే: కృత్రిమ మేధ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సహా అన్ని రంగాల్లో మన శ్రమశక్తిని అధిగమిస్తోందని సైయంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కృత్రిమమేధ ప్రభావాన్ని తగ్గించవచ్చని చెప్పారు. దేశంలో 62.4శాతం శ్రామిక జనాభా ఉన్నందునా శ్రామిక శక్తిని దేశాభివృద్ధికి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల్లో భాగంగా మంగళవారం హెచ్‌సీయూ ఉన్నతాధికారులు నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస శ్రేణిలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్యతో ఆర్థికాభివృద్ధి: ఆర్థిక వ్యవస్థను సరళీకరించేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆర్థిక సంస్కరణలను అమలుచేస్తోందని, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియాలను ప్రోత్సహిస్తోందన్నారు. ఆర్థిక అసమానతలు, అస్థిరత్వం, మౌలిక సదుపాయాల లేమి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. భవిష్యత్తులో వీటిని అధిగమించేందుకు నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్యను అందరికీ అందించాలని చెప్పారు. సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం, నైపుణ్యం కలిగిన కార్మికులను రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్న పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ నిర్మాణంలో భాగంగా సాంకేతిక ఆవిష్కరణలు, అంకుర సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. చదువుకున్నా ఉద్యోగాలు రాలేదంటూ బాధపడే యువత కష్టపడి పనిచేయాలని, వ్యక్తిగతంగా తెలివిగా మారేందుకు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ బీజేరావు, రిజిస్ట్రార్‌ దేవేష్‌ నిగమ్‌, ప్రొఫెసర్‌ ఘనశ్యామ్‌ కృష్ణ, విద్యార్థులు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని