logo

బైండోవర్‌ అతిక్రమిస్తే జైలుకే

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు.

Published : 28 Mar 2024 03:35 IST

రౌడీషీటర్లపై పోలీసుల నిఘా
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బైండోవర్‌, బౌండ్‌ డౌన్‌, రౌడీషీటర్‌ అంటే ఏమిటి?.. ఎవరిని బైండోవర్‌ చేస్తారు?.. హామీలను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాలివీ...

బైండోవర్‌ అంటే..

ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు, పాత నేరస్థులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని.. గత ఎన్నికల సమయంలో కొట్లాటలతో సంబంధమున్నవారిని, గొడవలు సృష్టించే అవకాశమున్న వ్యక్తులను సంబంధిత తహసీల్దారు ఎదుట హాజరుపరుస్తారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కలుగజేసుకోమని వారి నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుంటారు. ఒక్కొక్కరితో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు బాండ్‌ పేపర్‌ రాయించుకొని సొంత పూచీకత్తుపై.. అవసరమైతే మరొకరి పూచీకత్తు తీసుకుంటారు. ఈ ప్రక్రియను సత్ప్రవర్తన హామీ (బైండోవర్‌) అంటారు. బైండోవర్‌ చేయడమంటే వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయరు. వారిని కోర్టులో హాజరుపరచరు. హామీ ఉల్లంఘిస్తే మాత్రం కేసు నమోదు చేస్తారు. బైండోవర్‌ పత్రాలు ఆర్నెల్లపాటు పోలీసుల వద్ద ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలలు కాకపోవడంతో పాత బాండ్‌లే పనికొస్తాయి.

బౌండ్‌ డౌన్‌ అంటే?

బైండోవర్‌ సమయంలో నేర చరితులు, అనుమానితులు, శాంతిభద్రతల విఘాతానికి పాల్పడే అవకాశమున్నవారు బాండ్‌లో రాసిచ్చిన హామీని ఉల్లంఘించడాన్ని ‘బౌండ్‌ డౌన్‌’ అంటారు. బైండోవర్‌ అయిన వ్యక్తి ఆర్నెల్లలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే గంటల్లో అరెస్టు చేస్తారు. బాండ్‌ విలువకు సమానమైన మొత్తాన్ని అతని నుంచి వసూలు చేస్తారు. అతడు చెల్లించని పక్షంలో పూచీకత్తు ఇచ్చిన వ్యక్తి నుంచి తీసుకొని రాష్ట్ర ఖజానాకు పంపిస్తారు. తరచూ నేరాలు, హత్యలు చేయడం, అల్లర్లు సృష్టించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి వారిపై రౌడీషీట్‌ తెరుస్తారు. నేరచరితులపై నిఘా ఉంచాలని భావిస్తే స్థానిక పోలీసులు రౌడీషీట్‌ తెరుస్తారు.


తహసీల్దారు ఎదుట హాజరుకు కారణం..

తహసీల్దారు మండల పరిధిలో రెవెన్యూ అధికారిగా, ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్‌కు కొన్ని విషయాల్లో న్యాయపరమైన అధికారాలు ఉంటాయి. దీంతో పోలీసులు బైండోవర్‌ చేసే సమయంలో తహసీల్దారు ఎదుట హాజరుపరుస్తారు. తీవ్రతను బట్టి ఆర్డీవో ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. బైండోవర్‌ తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపించే అధికారం వీరికి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని