logo

కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు జరిమానా

బ్యాంకు సేవల్లో లోపాలపై కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది.

Published : 22 Apr 2024 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకు సేవల్లో లోపాలపై కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. మలక్‌పేట్‌కు చెందిన కె.సుందరరావు వ్యక్తిగత రుణం కోసం ఏబీఎన్‌ ఏఎంఆర్‌వో బ్యాంకును 2007 డిసెంబర్‌లో సంప్రదించారు. వివరాలు పరిశీలించిన బ్యాంకు రూ.4,43,423 రుణం మంజూరు చేసి ప్రతినెలా రూ.11,736 చెల్లించాలంది. కొన్ని నెలలు ఈఎంఐ కట్టిన తర్వాత ఆర్థిక పరిస్థితి మందగించి ఆయన డీఫాల్టర్‌ అయ్యారు. కొన్నాళ్లకు ఏబీఎన్‌ ఏఎంఆర్‌ఓ బ్యాంకు.. ఆర్బీఎస్‌ (రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్‌ల్యాండ్‌)లో విలీనం అయింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఫిర్యాదీ ఆర్బీఎస్‌ బ్యాంకును సంప్రదించి రుణానికి సంబంధించి తుది సెటిల్‌మెంట్‌ చేసుకుంటాననడంతో బ్యాంకు అంగీకరించగా 2012 మే నెలలో 2 విడతల్లో రూ.85 వేలు చెల్లించారు. అనంతరం ఆర్బీఎస్‌ బ్యాంకు కొటక్‌ మహీంద్రాలో విలీనమైంది. అయితే రుణం చెల్లించలేదంటూ కొటక్‌ నోటీసులు పంపడంతో ఫిర్యాదీ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌.. డీఫాల్టర్‌ జాబితా నుంచి ఫిర్యాదీని తొలగించాలని, పరిహారంగా రూ.20 వేలు,  కేసు ఖర్చులు రూ.5 వేలు చెల్లించాలంది.

‘సామ్‌సంగ్‌’కు సైతం..

వినియోగదారులను మభ్యపెట్టే ప్రకటనలు చేసి సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన ఫిర్యాదును విచారించి సామ్‌సంగ్‌ ఇండియాకు జరిమానా విధించింది. ఫిర్యాదీకి రూ.25 వేలు పరిహారం, కేసు ఖర్చులు రూ.5 వేలు చెల్లించాలంది. అయిదేళ్ల వారంటీ, వైఫై, ట్రైకేర్‌ ఫిల్టర్‌, 4వే స్వింగ్‌ తదితరాలున్నాయని మెహదీపట్నానికి చెందిన సాయి రఘురామ్‌ 2023 మార్చిలో రూ.44,490తో ఏసీని కొన్నారు. వైఫై పనిచేయకపోవడం, అయిదేళ్ల వారంటీ ఏసీకి కాకుండా ‘పీసీబీ’కి ఇవ్వడంపై ఫిర్యాదీ కమిషన్‌ను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని