logo

పార్కింగ్‌ సముదాయంలోనే.. రెండు సినిమా తెరలు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాంపల్లిలో నిర్మిస్తున్న మొదటి బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయం (ఎంఎల్‌పీ) పనులు చివరి దశకు చేరాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

Updated : 22 Apr 2024 05:23 IST

రూ.80 కోట్లతో చేపట్టిన పనులు చివరి దశకు..
నెలలో ట్రయల్‌ రన్‌కు మెట్రో రైలు ఎండీ ఆదేశం

నాంపల్లిలో పార్కింగ్‌ సముదాయం పనులను పరిశీలిస్తున్న మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాంపల్లిలో నిర్మిస్తున్న మొదటి బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయం (ఎంఎల్‌పీ) పనులు చివరి దశకు చేరాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇంజినీర్లతో కలిసి ఆదివారం పనులను పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొదటగా తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు నిలిపేలా ప్రాజెక్ట్‌ చేపట్టామన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..

  • నాంపల్లి కూడలిలో మెట్రోకి చెందిన అర ఎకరంలో 15 అంతస్తుల్లో బహుళ సముదాయ నిర్మాణం జరుగుతోంది. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌, ఐదు అంతస్తుల్లో వాణిజ్య దుకాణాలు, రెండు తెరలతో థియేటర్‌ రాబోతుంది. 250 కార్లు, 200 బైక్‌లను నిలిపే వీలుంటుంది.
  • మెస్సర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పీపీపీ విధానంలో రూ.80 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తోంది. 50 ఏళ్ల లీజ్‌ ఒప్పందమిది.  

నూతన సాంకేతికత ఇదే.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వాహనాలు నిలిపేందుకు నాలుగు టెర్మినల్స్‌ ఉన్నాయి.

  • వాహనాన్ని నిలిపేందుకు టర్న్‌ టేబుల్‌ ఉంటుంది. దానిపై వాహనాన్ని నిలిపితే సరి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్లి పార్క్‌ అవుతుంది. కొలతల ఆధారంగా కంప్యూటరైజ్డ్‌ వ్యవస్థ బండ్లను వర్గీకరిస్తుంది. తర్వాత ట్రాన్స్‌పోర్టర్‌ షటిల్‌ బండిని లిఫ్ట్‌ ద్వారా నిర్ణీత అంతస్తుకు తీసుకెళ్లి ఖాళీ స్థలంలో నిలుపుతుంది.
  • ఎంఎల్‌పీలోకి వాహనం ప్రవేశించిన సమయంలో వాహన దారులకి స్మార్ట్‌కార్డు జారీ అవుతుంది.
  • పార్క్‌ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి చెల్లించిన పార్కింగ్‌ టికెట్‌ను కార్డ్‌ రీడర్‌కు చూపగానే ట్రాన్స్‌పోర్టర్‌ షటిల్‌ ఆటోమెటిక్‌గా వాహనాన్ని అందజేస్తుంది. పార్కింగ్‌కు కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి రెండు నిమిషాలే పడుతుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని