logo

అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి

చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు.

Published : 06 May 2024 04:06 IST

విదేశాల్లో ఓటు వేయకపోతే కఠిన చర్యలు
ఆ విధానాలు ఇక్కడా అమలైతే అద్భుత మార్పు
ఈనాడు, హైదరాబాద్‌

చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్‌ టాక్స్‌ పేయర్స్‌’ అంటూ ఉద్యమాలు చేపడతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటేసేందుకు వెనకాడరు. ఆయా దేశాల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాలూ చేయడంతో పోలింగ్‌శాతం పెరుగుతోంది. ఆ విధానాలు ఇక్కడా అమలైతే అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజధానిలో ఏటా రూ.2 వేల కోట్లకుపైగా పన్నుల రూపేణా సమకూరుతోంది. సగటు పౌరుడు కొనుగోలు చేసే ప్రతి ఉత్పత్తిపైనా సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇక ఉద్యోగులు చెల్లించే పన్నులు ప్రత్యేకం. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్నవి లెక్కిస్తే రూ.వేలకోట్లు. ఆ పన్ను సవ్యంగా ఖర్చవుతుందా? అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన జరిగిందా? ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయా అనే కోణంలో ఆలోచించాలని సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కొందరు పౌరులు ఓటేయడానికి బద్దకిస్తున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 1984, 1989, 1991, 1998 ఎన్నికల్లో 70 శాతానికి మించి ఓటింగ్‌ నమోదైంది.

అక్కడ ఓటింగ్‌ ఇలా..

కొన్ని దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. లేకుంటే జరిమానాలు విధిస్తారు. ఆ పద్ధతులు ఇక్కడా అమలైతే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

  • బెల్జియంలో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.
  • ఆస్ట్రేలియాలోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్‌ నమోదవుతోంది.
  • సింగపూర్‌లో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుంది.
  • గ్రీస్‌లో ఓటు వేయని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని