logo

మల్కాజిగిరికి ప్రత్యేక మ్యానిఫెస్టో

‘మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్‌.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు.

Updated : 07 May 2024 05:52 IST

మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మొయినాబాద్‌, గౌతంనగర్

‘మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్‌.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు. పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘పాంచ్‌ న్యాయ్‌’ వాగ్దానాలు పక్కాగా అమలయ్యేలా కృషి చేస్తా. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉమ్మడి రంగారెడ్డిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మల్కాజిగిరిలో మరోసారి కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది’ అని ఎంపీ అభ్యర్థి పట్నం సునీత అన్నారు. ఆమె ‘ఈనాడు’తో పలు విషయాలు చర్చించారు.

ముఖ్యాంశాలు

  • మురుగునీటి శుద్ధి ప్లాంట్లను అందుబాటులోకి తెస్తాం. కాలుష్య నియంత్రణకు గ్రీన్‌ ఇండస్ట్రీలు నెలకొల్పుతాం. కాలుష్య కారక పరిశ్రమలను మూసివేస్తాం.
  • రోడ్ల మరమ్మతులు, విస్తరణ చేపడతాం. లింకు రోడ్ల అభివృద్ధి, అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు నిర్మిస్తాం.
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ-ఫ్లడ్డింగ్‌ మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేస్తాం.

ఎన్నికల్లో గెలిస్తే మీ తొలి ప్రాధాన్యలేంటి? వాటిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?

నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మ్యానిఫెస్టో సిద్ధం చేశాం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను అభివృద్ధి చేయడంతోపాటు జేఈఈ, నీట్‌ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తాం. ప్రతి డివిజన్‌లో స్మార్ట్‌ హైస్కూల్‌ ఏర్పాటుకు కృషి చేస్తా. బస్తీ ప్రాంతాల్లో అంగన్‌వాడీల అభివృద్ధితోపాటు ప్రతి వార్డు, డివిజన్‌లో పీహెచ్‌సీలు అందుబాటులోకి తెస్తాం. పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం వైద్యశిబిరాలు నిర్వహిస్తాం. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చెరువులు, నీటి కుంటలను అభివృద్ధి చేసి చుట్టూ పార్కులను నిర్మిస్తాం. కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఐటీఐలను స్థాపిస్తాం.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?

మా సమీపంలో ఎవరూ లేరు. మేమూ ఎవరినీ ప్రత్యర్థులుగా భావించడం లేదు. తొలుత భాజపా అనుకున్నా ఆ పార్టీని దాటి కాంగ్రెస్‌ ఎంతో ముందుంది. మా కార్యకర్తలు, అభిమానుల అంచనా ప్రకారం 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం.

మీరు గెలిచేందుకు ప్రధాన అంశాలేంటి? అవి మీకు ఎలా దోహదపడతాయి?

గత ప్రభుత్వం ప్రలోభాలు, ఇతర రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా కాంగ్రెస్‌ వైపు మారింది. సీఎం రేవంత్‌రెడ్డి కష్టపడేతత్వం ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఒక మహిళగా పోటీ చేస్తుండటంతో ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడనున్నాయి. ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాలు కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉన్నాయి. మంచి మెజారిటీతో గెలవబోతున్నాం.

మీ పార్లమెంట్‌ పరిధిలో పలు సమస్యలున్నాయి. వాటి పరిష్కారానికి నిధులు ఎలా తెస్తారు?

జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పలు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, పొలాలకు వెళ్లేందుకు రోడ్లు, తాగునీటి బోర్లు ఇలా చాలా సమస్యలు పరిష్కరించాం. వాజ్‌పేయీ నగర్‌, సఫిల్‌గూడ, బొల్లారం, రామకృష్ణాపురంలో ఆర్వోబీలు, ఆర్‌యూబీల పనులతోపాటు కంటోన్మెంట్‌లో ఆర్మీ రోడ్లు మూసివేత సమస్యలపై కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాం. రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటికే మెట్రో సేవల విస్తరణకు సీఎం హామీ ఇచ్చారు. ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ వైపు ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తాం.

ఏయే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయబోతున్నాయి? మీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో భారాస ఎమ్మెల్యేలే ఉన్నారు. మీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది?

భారాస ప్రభుత్వం అవినీతి తెలిసిందే. ఓటర్లను భయపెట్టి గెలిచారు. ప్రజలు ఆ విషయం తెలుసుకున్నారు. దీంతో ఈసారి ఆ ఓటర్లంతా కాంగ్రెస్‌కు పట్టం కట్టనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఈ ప్రాంతాలు అన్ని తిరిగా. రంగారెడ్డిలోకి రాని మల్కాజిగిరి, కంటోన్మెంట్‌ తప్ప.. అన్ని ప్రాంతాల్లో గతంలో అభివృద్ధి పనులు చేశాను. దీంతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారు. అదే నా గెలుపునకు సంకేతం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని