logo

మలక్‌పేట శ్రేణులకు దక్కని లోక్‌సభ

మలక్‌పేట వాసులకు లోక్‌సభ స్థానం నుంచి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. మలక్‌పేట నియోజకవర్గం 2009 వరకు నల్గొండ లోక్‌సభ పరిధిలో ఉండేది. అనంతరం హైదరాబాద్‌ లోక్‌సభలోకి మారింది.

Published : 07 May 2024 02:14 IST

న్యూస్‌టుడే, సైదాబాద్‌: మలక్‌పేట వాసులకు లోక్‌సభ స్థానం నుంచి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. మలక్‌పేట నియోజకవర్గం 2009 వరకు నల్గొండ లోక్‌సభ పరిధిలో ఉండేది. అనంతరం హైదరాబాద్‌ లోక్‌సభలోకి మారింది. మలక్‌పేట నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ఓటమి చవిచూసిన నల్లు ఇంద్రసేనారెడ్డి (భాజపా) 1980లో నల్గొండ లోక్‌సభకు తొలిసారిగా జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 1991, 1996, 1998, 2004ల్లో పోటీ చేసినా విజయం దక్కలేదు. 2014లో భువనగిరి పార్లమెంట్‌ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. అప్పటినుంచి పలు పార్టీ పదవుల్లో కొనసాగుతూ ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి 1984లో తెదేపా అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి, 1996లో తెదేపా అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిలు పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  అనంతరం 2002లో హైదరాబాద్‌ మేయర్‌గా కృష్ణారెడ్డి ఎంపికయ్యారు. ఆయనతోపాటు ఉప మేయర్‌గా కొనసాగిన సుభాష్‌ చందర్జీ 2004లో భాజపా అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. వీరంతా మజ్లీస్‌   అభ్యర్థులతో తలపడి ఓడారు.


నాడు పోటీ.. నేడు దోస్తీ

న్యూస్‌టుడే, సనత్‌నగర్‌: రాజకీయంలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటారు. దీనికి ప్రస్తుత సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి టి.పద్మారావుగౌడ్‌లే ఉదాహరణ. కార్పొరేటర్లు, శాసన సభ్యత్వాల కోసం ఒకనాడు హోరాహోరి తలపడిన వీరు ప్రస్తుతం మిత్రులుగా మారారు. వీరిద్దరు 1986లో రాజకీయ అరంగేట్రం చేశారు.మోండా డివిజన్‌ నుంచి కార్పొరేషన్‌ ఎన్నికల్లో తలపడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ గెలుపొందారు. 2004లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా తలసాని, తెరాస అభ్యర్థిగా పద్మారావు పోటీ పడ్డారు. ఈ పోటీలో పద్మారావుగౌడ్‌ గెలిచారు. మళ్లీ 2008 ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా తలసాని,  తెరాస అభ్యర్థిగా పద్మారావు మరోసారి ఢీకొన్నారు. తలసాని గెలిచారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తలసాని తెరాసలో చేరడంతో ఇద్దరూ  మంచి మిత్రులయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ భారాస  ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ గెలుపు కోసం తలసాని కృషి చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని