logo

ఈవీఎంలు సిద్ధం.. స్ట్రాంగ్‌ రూముల్లో భద్రం

ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం చేపట్టిన కమిషనింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మంగళవారంతో అన్ని స్ట్రాంగ్‌ రూముల్లో ముగుస్తుందని ఇంజినీర్లు సోమవారం వెల్లడించారు.

Published : 07 May 2024 02:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం చేపట్టిన కమిషనింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మంగళవారంతో అన్ని స్ట్రాంగ్‌ రూముల్లో ముగుస్తుందని ఇంజినీర్లు సోమవారం వెల్లడించారు. పోటీలోని అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగానే సంబంధిత పనులు మొదలయ్యాయి. బ్యాలెట్‌ పేపరు ముద్రణ పూర్తయ్యాక కమిషనింగ్‌ ప్రారంభమైంది. రాజకీయ పార్టీల సమక్షంలో అసెంబ్లీ స్థానాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముల్లో ప్రక్రియ జరుగుతోంది. కమిషనింగ్‌ పూర్తవగానే.. ఈవీఎంలపై ఉండే క్రమ సంఖ్య వివరాలను రాజకీయపార్టీల ప్రతినిధులకు అందజేస్తున్నామని అధికారులు వెల్లడించారు. నేతల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూములకు తాళాలు వేస్తున్నామన్నారు. మే 13న ఎన్నిక జరగనుండగా..  ఆయా ఈవీఎంలను పోలింగ్‌ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్‌ చేయనున్నారు. అప్పుడు పోలింగ్‌ కేంద్రాల వారీగా కేటాయింపైన ఈవీఎంల వివరాలను రాజకీయపార్టీలకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.

పేర్లు తెలుగు వర్ణమాల ప్రకారం

బ్యాలెట్‌ పేపరుపై అభ్యర్థుల పేర్లను తెలుగు వర్ణమాల ప్రకారం.. జాతీయ పార్టీల అభ్యర్థులు, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు, స్వతంత్రులు అనే వరుస క్రమంలో ముద్రిస్తారు.

బ్యాలెట్‌ పేపరుపై ఉండే అభ్యర్థుల పేర్లను బ్యాలెట్‌ యూనిట్‌లో ప్రోగ్రామింగ్‌ చేస్తారు. ఎవరికి ఓటేస్తే.. వారికి పడేట్లు చేయడానికి ఈ ప్రోగ్రామింగ్‌ ఉపయోగపడుతుంది. వీవీప్యాట్‌ డబ్బాలో 7 సెకన్లపాటు మనం ఏ అభ్యర్థికి ఓటేశామో, అతని పేరు, పార్టీ పేరు, గుర్తుతో ముద్రితమైన చీటీని కూడా చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని