logo

ఏడుగురు ఎమ్మెల్యేలు మా వాళ్లే.. ఎంపీ సీటు మాదే

‘మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్‌ నియోజకవర్గం. ఇదో మినీ ఇండియా. భిన్న ప్రాంతాల వారున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు, అన్నిరంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మెట్రో కావాలనే ఆకాంక్ష ఎక్కువ ప్రాంతాల నుంచి వినబడుతోంది.

Published : 08 May 2024 04:00 IST

మల్కాజిగిరి లోక్‌సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌, ఉప్పల్‌, న్యూస్‌టుడే

‘మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్‌ నియోజకవర్గం. ఇదో మినీ ఇండియా. భిన్న ప్రాంతాల వారున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు, అన్నిరంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మెట్రో కావాలనే ఆకాంక్ష ఎక్కువ ప్రాంతాల నుంచి వినబడుతోంది. దీని విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతాను’ అని మల్కాజిగిరి భారాస ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి, ఇతర అంశాలపై ‘ఈనాడు’తో మాట్లాడారు.

మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇందుకు ఏయే అంశాలు దోహదం చేయనున్నాయి?
గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఇందుకు చాలా అంశాలే ఉన్నాయి. పదేళ్లలో భారాస ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. పథకాలతో అన్ని వర్గాలను ఆదుకుంది. నీరు, కరెంటు సమస్య లేకుండా చేశాం. ప్లైఓవర్లు, మెట్రో అందుబాటులోకి వచ్చాయి. ఐటీ, పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టాం. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలోని ఏడు సీట్లలోనూ భారాస అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. లోక్‌సభలోనూ ఇదే పునరావృతమవుతుందనే నమ్మకం ఉంది.

ఈ ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు?
ఈ ఎన్నికలు కేంద్రానికి సంబంధించినవని.. జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందనే భావన కొందరిలో ఉంది. ఇది సరైంది కాదు. గత ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఇక్కడ గెలిచి నియోజకవర్గానికి చేసింది సున్నా. దిల్లీలో బలమైన గొంతుకనవుతానని చెప్పి కనీసం గల్లీలను కూడా పట్టించుకోలేదు. ఈ అనుభవాలతో జాతీయ పార్టీలకు ఓట్లు వేయాలనే మూడ్‌లో ప్రజలు లేరు. రాష్ట్ర ప్రయోజనాలను, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను బలంగా తీసుకెళ్లేది ప్రాంతీయ పార్టీనే. ఈసారి ఇది కీలకంగా మారింది.

విజయం సాధిస్తే.. నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు?
కేంద్ర నిధులతో నిర్మిస్తున్నామని భాజపా నాయకులు గొప్పలు చెప్పుకొనే ఉప్పల్‌ ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ ఏడేళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఒక్క ఫ్లైఓవర్‌ను పూర్తి చేయలేకపోయారు. కంటోన్మెంట్‌లో ఆర్మీ భూములున్నాయి. రహదారుల విస్తరణకు ఈ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదు. గెలిపిస్తే సాధించుకొస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎంపీగా ఐదేళ్లలో ఏం చేయలేదు. నేను గెలిస్తే దీనిపై దృష్టి పెడతా. ఆర్‌ఆర్‌ఆర్‌, జాతీయ రహదారుల వరకు లింక్‌రోడ్లు, ఎంఎంటీఎస్‌ విస్తరణకు కృషి చేస్తా. పలుచోట్ల రైల్వే క్రాసింగ్స్‌ ఉన్నాయి. అక్కడ అండర్‌పాస్‌, పైవంతెనల నిర్మాణానికి ప్రయత్నిస్తా. కేంద్రీయ విద్యాలయాలు తక్కువున్నాయి. వాటి ఏర్పాటు దిశగా కృషి ఉంటుంది.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు.. మీ దృష్టిలో వారి బలహీనతలు ఏంటి?  
భాజపాతో పోటీ ఉంది. ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో పెద్ద నాయకుడు కావొచ్చు. మల్కాజిగిరిలో కాదు. ఇక్కడ ఏం సేవ చేశారని వచ్చి పోటీ చేస్తున్నారు? భారాసలో అన్ని పదవులు అనుభవించి 3 నెలలు అధికారం లేకపోయేసరికి కాంగ్రెస్‌కు మారిన పట్నం సునీత వలస వచ్చి పోటీ చేస్తే జనం గెలిపిస్తారా? కాంగ్రెస్‌ గెలిచాక హామీలేవీ నెరవేర్చలేదు. కొద్ది నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీకి, స్థానికంగా ఉండేవారికి ఓటు వేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. మా ఎమ్మెల్యేలు మంచి ఆధిక్యంతో గెలిచారు. మెజారిటీ తగ్గొచ్చు అనుకుంటున్నా. పాతికేళ్లుగా మధుర ఛారిటబుల్‌ ట్రస్ట్‌తో పేదలకు ఎంతో సేవ చేశాను. ఇవన్నీ నన్ను గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్నాను.


ముఖ్యాంశాలు

  • మల్కాజిగిరిలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన తరువాత సీఎం అయ్యారు. అయినా ఈ నియోజకవర్గానికి ఆయన ఒక్క పని చేయలేదు. ఓడగొట్టిన కొడంగల్‌కు మాత్రం రూ.3500 కోట్ల సాగునీటి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసుకున్నారు. మళ్లీ ఆ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు?
  • ఈ నియోజకవర్గం ఏమైనా ఓడిన నేతలకు అడ్డానా? గతంలో స్థానికేతర నాయకులు గెలిచినా ఏమీ చేయలేదు.
  • జూబ్లీ బస్‌స్టేషన్‌-కరీంనగర్‌ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌వే మార్గానికి అవసరమైన భూముల కోసం కేసీఆర్‌ ప్రయత్నం చేశారు. ఇటీవల అనుమతులు రావడంతో పదిరోజుల్లోనే తెచ్చానని రేవంత్‌రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు