logo

పోడు.. కొలిక్కి వచ్చేనా!

పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా జిల్లాలో కసరత్తు తుదిదశకు చేరింది. పోడు భూములకు పట్టాలనగానే అనేక మంది సాగు చేసుకోకున్నా...

Published : 28 Nov 2022 03:40 IST

క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన

న్యూస్‌టుడే, జగిత్యాల

పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా జిల్లాలో కసరత్తు తుదిదశకు చేరింది. పోడు భూములకు పట్టాలనగానే అనేక మంది సాగు చేసుకోకున్నా...ఆక్రమణలో లేకున్నా దరఖాస్తులు చేసుకోగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఎక్కువగా ఉత్తుత్తి దరఖాస్తులేనని తేలుతోంది. జిల్లాలో 380 గ్రామపంచాయతీలుండగా ప్రధానంగా 55 గ్రామపంచాయతీల నుంచి 4829 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 394 మంది ఎస్టీలుండగా 3435 మంది ఇతరులున్నారు. దరఖాస్తుదారులు 9437 ఎకరాల అటవీ విస్తీర్ణం సాగు చేసుకుంటున్నట్లు పేర్కొనగా అందులో 3110.31 ఎకరాలు ఎస్టీలు, 6326.29 ఎకరాలు ఇతరులు ఆక్రమణలో ఉన్నట్లు దరఖాస్తుల్లో పేర్కొనగా అటవీ, రెవెన్యూ పంచాయతీ అధికారులు పరిశీలించగా 8278.19 ఎకరాల భూమి ఆర్వోఎఫ్‌ఆర్‌ యాప్‌లో చూపుతోంది. అయితే పరిశీలించిన 4700 దరఖాస్తుల్లో 2926 మంది ఆక్రమణలో లేనట్లు తేలింది. పరిశీలించిన దరఖాస్తుల్లో 1272 మంది ఎస్టీలు 991.31 ఎకరాల్లో, 3428 మంది ఇతరుల్లో 1184.58 ఎకరాల ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించగా ఇప్పటివరకు 707 ఎస్టీ, 1075 ఇతరుల దరఖాస్తులపై గ్రామసభలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయలు అటవీ అధికారి శ్రీనివాస్‌రావును హతమార్చిన నేపథ్యంలో గ్రామసభలకు అటవీ అధికారులు దూరంగా ఉండగా పంచాయతీ అధికారులు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందగా రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పట్టాలివ్వాలన్నా కష్టమే!

పోడు భూములకు పట్టాలివ్వాలన్నా జిల్లాలో కష్టంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్‌ 13 వరకు అటవీ భూములు ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారు అర్హులు దీని ప్రకారం గిరిజనులకు పట్టాలివ్వవచ్చు. గిరిజనేతరులైతే కనీసం 75 ఏళ్లు ఆక్రమణలో ఉండాలి. జిల్లాలో నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది అర్హులవుతారు. గతంలోనూ పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలిచ్చారు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలంలో అత్యధికంగా 166 మందికి 332.14 ఎకరాల పట్టాలివ్వగా జిల్లాలో పలు మండలాల్లోనూ కొంతమందికి పట్టాలిచ్చారు. ఇదేకాకుండా అనేక గ్రామాల్లో అటవీ భూములను ఆక్రమించుకుని రెవెన్యూ అధికారుల నుంచి అక్రమంగా పట్టాలు పొందిన వారున్నారు. బీర్‌పూర్‌ మండలంలోనే అటవీ శాఖకు చెందిన 4120 ఎకరాలు మాయం చేశారు. వాటికి రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఆ వివాదం నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చేనా వచ్చినా ఎంత మందికి పట్టాలు దక్కుతాయో చూడాలి.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

పోడు భూముల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి చెప్పారు. గ్రామసభలు పూర్తికావస్తున్నాయని ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హులైన వారికే పట్టాలిస్తామని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని