logo

వలసజీవిపై గుండెపోటు

గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న కుటుంబాల్లో ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. పని ఒత్తిడి, వీసా మోసాలు, వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో మృత్యు ఘటనలు పెరుగుతున్నాయి.

Published : 09 Dec 2022 05:51 IST

న్యూస్‌టుడే- మేడిపల్లి(జగిత్యాల): గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న కుటుంబాల్లో ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. పని ఒత్తిడి, వీసా మోసాలు, వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో మృత్యు ఘటనలు పెరుగుతున్నాయి. కళ్లముందు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే తట్టుకోలేని అభాగ్యుల కుటుంబాలు వేల మైళ్ల దూరంలో నిర్జీవంగా మారిన తమ వారి గురించి తెలుసుకుని తల్లడిల్లుతున్నారు. అక్కడ కంపెనీలు చేయూత ఇవ్వక.. ఇక్కడ ప్రజాప్రతినిధుల చేదోడు లేక విధి వైపరీత్యాన్ని తలచుకుంటూ రోదిస్తున్నారు. గుండెనొప్పితో మృతి చెందుతున్న ఘటనలు తలచుకుంటూ పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి..

విదేశీ జర్నలిస్ట్‌ అధ్యయనం

స్విట్జర్లాండ్‌కు చెందిన ఫొటో జర్నలిస్ట్‌ జోసెఫ్‌ బెంజిమిన్‌ కక్షౌరి నవంబరులో గల్ఫ్‌ మృతుల కుటుంబాల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. గల్ఫ్‌ దేశాల్లో మృతిచెందుతున్న వారికి అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్న సాయంపై ఆరా తీశారు. ఆయన కోనరావుపేట మండలం శివలింగాలపల్లికి చెందిన మారవేని రాములు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయనతో పాటు పలువురు గుండెపోటుతో చనిపోతున్న ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు సాయం చేయాలని, బాధితులు పనిచేస్తున్న కంపెనీలు కూడా ఆదుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గల్ఫ్‌ మరణాలపై అధ్యయనం చేస్తున్న విదేశీ జర్నలిస్ట్‌


బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
- నరేశ్‌ రెడ్డి, పీసీసీ గల్ఫ్‌ కన్వీనర్‌

గల్ఫ్‌ దేశాల్లో కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆయా సందర్భాల్లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్నారై విభాగం ఏర్పాటు చేసి ఇతర దేశాలకు ఎందరు వెళ్తున్నారో కచ్చితమైన వివరాలు నమోదు చేయాలి. మృతిచెందిన వారి వివరాలు అందుబాటులో ఉంచి ఎక్స్‌గ్రేషియా అందజేయాలి. మరణాలపై అధ్యయనం చేసి కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా చేయూత అందించేలా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని