logo

కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులు : మంత్రి

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు.

Published : 19 Apr 2024 04:49 IST

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుజూరాబాద్‌ గ్రామీణం, పట్టణం, తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అలుగునూరు, హుజూరాబాద్‌లలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని బూత్‌ల్లో కలిపి లక్ష మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌లు ఏం పని చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. తాను ఎంపీగా తిరుపతికి రైలు, కరీంనగర్‌కు పాస్‌పోర్ట్‌ కార్యాలయం, కేంద్రియ విద్యాలయాలు, మోడల్‌స్కూళ్లు, ఆసుపత్రులు తెచ్చినట్లు వివరించారు. తెలంగాణలో ప్రధాని మోదీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజాస్వామిక వాది రాహుల్‌గాంధీ, అప్రజాస్వామికవాది మోదీకి మధ్య జరుగుతున్న పోరాటమిదన్నారు. ఎన్నికల తర్వాత అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. భారాస పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ బూత్‌స్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ క్రమంలో అనర్హులకు ఎల్‌వోసీ ఎలా ఇప్పిస్తారని పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. వొడితల ప్రణవ్‌ మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాకే ప్రజలను ఓట్లడగాలన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ఉన్న చోట ఎంపీ కూడా కాంగ్రెస్‌ ఉంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రోత్సాహమివ్వాలని, యువతతోనే మంచి ఫలితాలు సాధ్యమని తెలిపారు. నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ ఎంపీ టికెట్‌ ఎవరికీ ఇచ్చినా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పురుమళ్ల శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, కోడూరి సత్యనారాయణగౌడ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని