logo

గీతదాటితే కొరడా ఝళిపిస్తారు

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ని తీసుకొచ్చింది.

Published : 19 Apr 2024 04:52 IST

జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, కరీంనగర్‌ కలెక్టరేట్‌

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ని తీసుకొచ్చింది. 1962 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎన్నికల కోడ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాలు, రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తుంటారు. ప్రవర్తనా నియమావళికి లోబడే పార్టీలు, అభ్యర్థులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గీత దాటితే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ప్రచార సమయంలో ఏర్పాటు చేసిన విందులో అభ్యర్థి పాల్గొంటే దాని ఖర్చు మొత్తాన్ని ఎన్నికల నిఘా వర్గాలు సదరు అభ్యర్థి ఎన్నికల ఖర్చు ఖాతాలో లెక్కిస్తారు. 2014 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. మత సంస్థల్లో లోపాయికారీగా ప్రచారం సాగిస్తున్నా దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

ప్రచారాలపై షాడో బృందాలు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను నామినేషన్ల దాఖలు నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల ప్రచార ఖర్చులను లెక్కించేందుకు ఎన్నికల సంఘం షాడో రిజిష్టర్లను నిర్వహిస్తోంది. మొన్నటి వరకు ఎస్‌ఎస్‌టీ బృందాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వగా వారు గురువారం నుంచి ఎన్నికల విధుల్లోకి వచ్చారు. జిల్లాలో ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు 12 పని చేస్తున్నాయి. వీటితోపాటు ఎన్నికల సంఘం సీ-విజిల్‌ యాప్‌, ఎన్‌జీఎస్‌పీతోపాటు 1950 ఫోన్‌ నంబరును అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి జిల్లాల్లో వీటికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వీటిని ఆయా డివిజన్ల ఆర్డీవోల పరిధిలో పరిష్కరించారు. 1950కి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ను ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాల ద్వారా పరిష్కరించారు.


సువిధలో అనుమతులు

రాజకీయ పార్టీల ప్రచారాలకు బహిరంగ సభలు, ర్యాలీలకు సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. ఇందుకోసం ఎన్నికల సంఘం సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అనుమతులు లభిస్తాయి. అభ్యర్థులు ముందుగా https://suvidha.eci.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. అనంతరం మీటింగ్‌లు, ర్యాలీలు, ప్రచార వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయాల ఏర్పాటు, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఎయిర్‌ బెలూన్లు, వీడియో వ్యాన్‌లు, హోర్డింగ్‌ల ఏర్పాటు తదితర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్‌ సమర్పించే వెసులుబాటు సైతం ఉంది. ఆఫ్‌లైన్‌లోనూ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్నికల కార్యాలయంలో ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా ఆయా పార్టీల ప్రచార రథాలకు సంబంధించినవి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని