logo

అనారోగ్యంతో ఆబ్కారీ ఎస్సై మృతి

ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆబ్కారీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాదుల కాళిప్రసాద్‌ (61) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందాల్సిన ఆయన అకాల మరణంతో తీవ్ర విషాదం నెలకొంది.

Updated : 04 May 2024 06:12 IST

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆబ్కారీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాదుల కాళిప్రసాద్‌ (61) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందాల్సిన ఆయన అకాల మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక ఎక్సైజ్‌ పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కాళిప్రసాద్‌ హైదరాబాద్‌లోని డిస్టలరీలో పని చేస్తూ మల్టీజోన్‌ బదిలీల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయానికి వచ్చారు. మండల కేంద్రంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఎప్పటిలాగే గురువారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఆయన శుక్రవారం ఉదయం చూసేసరికి విగతజీవిగా కనిపించారు. కొంత కాలంగా మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. కాళిప్రసాద్‌ భార్య సావిత్రి 16 రోజుల కిందట చనిపోయారు. కుమారుడు సాయిరేవంత్‌, కుమార్తె సంతోషి ఉన్నారు. కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఎల్లారెడ్డిపేటకు చేరుకొని, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.


పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిమ్మాపూర్‌ మండల పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇన్‌క్లైన్‌ బస్తీ ప్రాంతానికి చెందిన మాస శివప్రియ (20) కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలోని కళాశాలలో ఫార్మా-డీ ద్వితీయ సంవత్సరం చదువుతూ సమీపంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. శుక్రవారం పరీక్షలు ప్రారంభం కానుండగా ఉత్తీర్ణత సాధిస్తానో లేదోనని ఆందోళన చెందింది. ఉదయం హాస్టల్‌ భవనం రెండో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఎల్‌ఎండీ బ్లూకోల్ట్స్‌ పోలీసులు శివప్రియ తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు పేర్కొన్నారు.


కోళ్ల వ్యాన్‌ ఢీకొని బాలుడి దుర్మరణం

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కోళ్ల వ్యాన్‌ ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన వేములవాడ గ్రామీణ మండలం నాగయ్యపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూర రాధ, రాజేశంల కుమారుడు సూర హర్షవర్ధన్‌ (6) గ్రామ బస్టాప్‌ వద్ద రోడ్డు దాటుతుండగా వేములవాడ నుంచి చందుర్తి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా, వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేయగా, న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతి తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


రోడ్డు ప్రమాదంలో మహిళ ...

సైదాపూర్‌, న్యూస్‌టుడే: అత్త మరణవార్త తెలియడంతో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడలు మృతి చెందిన విషాద ఘటన సైదాపూర్‌ మండల పరిధిలో జరిగింది. ఎస్సై ఆరోగ్యం కథనం ప్రకారం.. హుజూరాబాద్‌ మండలం కొత్తపల్లి సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన గరిగె చంద్రయ్యకు రాములపల్లిలో ఉంటున్న సోదరుడు రాజు శుక్రవారం ఉదయమే అమ్మ చనిపోయిందని ఫోన్‌ ద్వారా సమాచారం అందజేశాడు. చంద్రయ్య సూచన మేరకు ముందుగా అతడి భార్య రమ (54), కుమారుడు శివకృష్ణ ద్విచక్రవాహనంపై రాములపల్లికి బయలుదేరారు. ఎలబోతారం గ్రామంలో ఒక్కసారిగా కుక్కలు అడ్డుగా రాగా అదుపుతప్పి కిందపడ్డారు. రమ తలకు తీవ్ర గాయాలవగా హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. శివకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


రూ.81 లక్షల విలువైన ఆభరణాల పట్టివేత

జ్యోతినగర్‌(మార్కండేయకాలనీ), న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీపీసీ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో శుక్రవారం భారీగా ఆభరణాలను పట్టుకొన్నారు. మంచిర్యాలకు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 1042.37 గ్రాముల బంగారు, 6731.29 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయన్నారు. వాటి విలువ సుమారు రూ.81,02,691 ఉంటుందని ఎస్సై టి.ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. వాహనంలో వెళ్తున్న కరీంనగర్‌ బోయవాడకు చెందిన కొత్తకొండ నవీన్‌ను ఆభరాణాలకు సంబంధించిన బిల్లులు చూపించాలని కోరగా సరైన బిల్లులు చూపించకపోవడంతో ఆభరణాలను ఎన్నికల నిఘా బృందానికి అందజేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని