logo

రిజర్వేషన్లను రక్షించుకుందాం

పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు.

Published : 05 May 2024 04:36 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

రామడుగులో ప్రసంగిస్తున్న మంత్రి పొన్నం, చిత్రంలో ఎమ్మెల్యే సత్యం, అభ్యర్థి రాజేందర్‌రావు

చొప్పదండి, రామడుగు, మల్యాల: పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. శనివారం చొప్పదండి, రామడుగుల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో మంత్రి మాట్లాడారు. రాముడి జపం చేస్తున్న భాజపా అంతరంగమంతా రిజర్వేషన్ల రద్దుపైనే ఉందని విమర్శించారు. దేవుడి పేరుతో ఓట్లు అడగటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగు నెలల స్వల్ప కాలంలోనే సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో భారాసలు హామీలు నెరవేర్చలేదన్నారు. అది మరిపించటానికి కాంగ్రెస్‌పై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీలుగా బండి సంజయ్‌కుమార్‌, బోయినపల్లి వినోద్‌కుమార్‌లు కరీంనగర్‌ పార్లమెంటు అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. నియోజకవర్గానికి బండి సంజయ్‌కుమార్‌ ఏం చేశాడో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నూతన రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు పథకాలను ఇస్తామన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశమిచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, పురపాలిక అధ్యక్షురాలు నీరజ, ఎంపీపీ జవ్వాజి హరీశ్‌, ఆల్గీ జిల్లా ఛైర్మన్‌ ఉప్పుల అంజనీప్రసాద్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిగౌడ్‌, బొమ్మరవేని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. మల్యాల అంగడి బజారులో మంత్రి మాట్లాడుతూ కొండగట్టు అంజన్న గుడికి ఒక్క రూపాయి తేలేని, దేవుడి పేరుమీద రాజకీయం చేసే మీరు ఓట్లెలా అడుగుతారని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌కుమార్‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని