logo

హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ మోసం

శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు.

Published : 06 May 2024 06:35 IST

భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌

గంగాధరలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

గంగాధర, తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే : శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. గంగాధర ప్రధాన కూడలిలో ఆదివారం రాత్రి భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వలేదన్నారు. మహిళలకు రూ.2500 మహాలక్ష్మి పథకం అమలు చేయలేదన్నారు. రైతు భరోసా కింద రూ.14 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఎందుకు మంజూరు చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వలేదన్నారు. విద్యార్థి భరోసా కింద రూ. 5 లక్షలు ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. ఈ పథకాలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి గాడిద గుడ్డు చూపించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్‌, భారాసల నాయకులను నమ్మి మోసపోవద్దని కోరారు. మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ పెరుక శ్రవణ్‌కుమార్‌, మండలాధ్యక్షులు కోల అశోక్‌, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేడ్కర్‌ స్టేడియంలో వాకర్స్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కొంతమంది సోకాల్డ్‌ మేధావులతో సామాజిక మాధ్యమం ద్వారా కేసీఆరే బెటర్‌ అనేలా ప్రచారం చేయిస్తున్నారు. ఒక్కసారి కేసీఆర్‌ చేసిన మోసాలను గుర్తుంచుకోండి. ఇక్కడి రైతులను ఆదుకోకుండా పంజాబ్‌ పోయి అక్కడి రైతులకు డబ్బులిచ్చి ప్రచారం చేసుకున్నారు. తెలంగాణను ఏటీఎంగా వాడుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై, నిరుద్యోగుల బతుకులతో చెలగాటమాడారు.’’ అని అన్నారు. అనంతరం బండి సంజయ్‌ కరీంనగర్‌ కాపువాడలో మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమావేశానికి సంజయ్‌ హాజరై భాజపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌, భారాసల కుమ్ముక్కు రాజకీయాలను ఎండగడుతున్నందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని