భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ

మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated : 07 May 2024 06:00 IST

మాజీ మంత్రి కేటీఆర్‌

 సిరిసిల్ల కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌

ముస్తాబాద్‌, సిరిసిల్ల గ్రామీణం, తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌, గాంధీచౌక్‌, కొత్త బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, సిరిసిల్లలో కార్నర్‌ మీటింగ్‌, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌లలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లోనూ కేటీఆర్‌ మాట్లాడారు. ప్రధాని మోదీ పదేళ్లలో భారతదేశానికి, తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. నీకు ఎందుకు ఓటేయాలని అడిగితే సిరిసిల్లలో వంద పనులు చూపించగల్గుతానని చెప్పాను. భాజపా కేంద్రంలో అధికారంలో ఉండి సిరిసిల్ల, కరీంనగర్‌, తెలంగాణలో ఒక్క పని చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. అయిదేళ్లలో ఎంపీ బండి సంజయ్‌ ఎన్నిసార్లు మండలానికి వచ్చారని ప్రజలను అడిగారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకుండా అడ్డుకోవాలంటే గులాబీ కండువా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చిందని, అవి నెరవేరాలంటే గులాబీ కండువా రెపరెపలాడితేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. జిల్లాలను రద్దు చేసి, పార్లమెంటు స్థానానికి ఒక్కటే జిల్లా ఉండాలని రేవంత్‌రెడ్డి చెప్పుతున్నారని, ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలంటే కచ్చితంగా పార్లమెంటులో భారాస ప్రాతినిధ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని, ఆయన బస్టాండ్‌లో నిలబడితే కాంగ్రెసోళ్లే గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు పెరిగాయని పేర్కొన్నారు. చిన్న చిన్న మనస్పర్థాలు ఉంటే పక్కన పెట్టి కష్టపడి పనిచేసి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ నెల 10న సిరిసిల్లలో నిర్వహించే కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, భారాస రాష్ట్ర నాయకులు, సెస్‌ ఛైర్మన్‌ చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్‌, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎంపీపీ పడిగెల మానస, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జిందం కళ, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, భారాస మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, మున్సిపల్‌ కౌన్సిలర్లు, భారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని