logo
Published : 03 Dec 2021 00:52 IST

ఒమిక్రాన్‌..సుడిగాలి వేగం


కర్ణాటక- కేరళ సరిహద్దులో ప్రజల ఆరోగ్య పరిశీలన కేంద్రం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ఒమిక్రాన్‌ ప్రభావిత 30 దేశాల జాబితాలో భారతదేశం చేరింది. బెంగళూరులో వెలుగుచూసిన రెండు కేసులే దేశంలో తొలి ఒమిక్రాన్‌ జాడ కావడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరు నెలల కిందటే డెల్టా వైరస్‌ తాకిడికి అతలాకుతలం అయిన దేశం మరో ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కానుంది. సాధారణ కరోనా వైరస్‌కు అనేక రెట్లు అధికంగా వ్యాపించే ఒమిక్రాన్‌- డెల్టా వైరస్‌తో పోలిస్తే ప్రమాదకారి కాదన్న వాస్తవమే కాస్త ఊరట కల్గిస్తోంది. సుడిగాలి వేగంగా శరీరాన్ని ఆవహించే ఒమిక్రాన్‌ను నిలువరించేందుకు సర్కారు కంటే ప్రజల స్వీయ రక్షణే కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతవారం ఇద్దరు వ్యక్తుల్లో భిన్నమైన వైరస్‌ను గుర్తించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ- వీటి జన్యు లక్షణాల పరీక్ష నిమిత్తం ఇన్సాకాగ్‌కు పంపారు. ఈ ఫలితాలను గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించటంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తం అయ్యింది. దేశంలో తొలి ఒమిక్రాన్‌ కేసులు గుర్తించగా ఆ రెండు కేసులు బెంగళూరులోనేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సర్కారు మరోమారు కరోనాపై యుద్ధానికి సిద్ధమైంది.

ఆ ఇద్దరి నేపథ్యం

1. దక్షిణాఫ్రికా పౌరుడు (66).. వృత్తి- ఐటీ కన్సల్టెంట్‌. నవంబరు 20న బెంగళూరు విమానాశ్రయానికి వచ్చారు. -అదే రోజున ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో కొత్త వేరియంట్‌ అనుమానంతో జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు సిఫార్సు చేశారు. 23 వరకు సర్కారు పర్యవేక్షణలో ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. 24న కరోనా పరీక్ష నెగటివ్‌ నివేదిక వచ్చాక డిస్చార్జ్‌ అయ్యారు. 26న ఓ ఐటీ కంపెనీ బోర్డ్‌ మీటింగ్‌కు హాజరైన ఆయన 27న మరోమారు కరోనా పరీక్షలో నెగటివ్‌గా నిర్ధరణతో దుబాయ్‌ మీదుగా దక్షిణాఫ్రికాకు తిరుగు ప్రయాణమయ్యారు. 24 ప్రాథమిక, 240 ద్వితీయ సంబంధీకులకు కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్‌ అని తేలింది.

2. బెంగళూరు వాసి (46) : వైద్య వృత్తిలో ఉన్న ఆయనకు విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు. 20న ఆరోగ్య సమస్యలతో కరోనా పరీక్ష చేయగా నెగటివ్‌గా నిర్ధరణ అయ్యింది. 22 వరకు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 23న కరోనా పరీక్ష చేయిస్తే.. పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. 25న సీటీ ప్రమాణాల్లో వ్యత్యాసం రావడంతో జినోమ్‌ స్వీక్వెన్సింగ్‌ పరీక్షకు సిఫార్సు చేశారు. 13 ప్రాథమిక, 205 ద్వితీయ సంబంధీకులకు పరీక్ష చేశారు. ముగ్గురు ప్రాథమిక, ఇద్దరు ద్వితీయ సంబంధీకులకు కరోనా అని తేలింది. వీరి- కొత్త వేరియంట్‌కు సంబంధించి ఇంకా నివేదిక రావాలి.

సర్కారు అప్రమత్తం

ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడటంతో కర్ణాటక సర్కారు అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణ నేపథ్యం లేని వైద్యుడికి కొత్త వైరస్‌ సోకటం, అతను ఈనెల 18, 19 తేదీల్లో బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో వైద్య సదస్సులో పాల్గొనటం ఆందోళన కల్గించే అంశం. ఆయనతో పాటు మరో వైద్యుడికి కొత్త వేరియంట్‌ లక్షణాలున్నట్లు గుర్తించటంతో ఆయన ఆరోగ్యంపై సర్కారు తీవ్ర నిఘా ఉంచింది. ఈ వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్న రోగులు, ఆస్పత్రి సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేంద్ర సర్కారు మార్గదర్శకాల ప్రకారం ఇకపై విదేశీ ప్రయాణికులే కాకుండా కరోనా లక్షణాలు కనిపించిన వారికి వాటి తీవ్రతకు అనుగుణంగా జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా నివేదికలతో సంబంధం లేకుండా వారం రోజుల పాటు క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. వీరిలో రెండు శాతం మందికి జినోమ్‌ పరీక్షలు చేయాలన్న నిబంధన అమలు చేస్తారు. కడెల్టా వైరస్‌తో పోలిస్తే ఇది ఏమాత్రం ప్రమాదకారి కాదని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ ప్రకటించారు.

ఒమిక్రాన్‌ నివారణపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాతో దిల్లీలో గురువారం సమావేశమైన

ముఖ్యమంత్రి బొమ్మై, లోక్‌సభ సభ్యుడు శివకుమార్‌ ఉదాసీ, ముఖ్యమంత్రి కార్యదర్శి మంజునాథ ప్రసాద్‌

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని