logo

రాజధాని.. ఒడ్డున పడేనా?

రాజధాని నగరం జులై నుంచి సెప్టెంబరు వరకు కురిసిన వర్షాలకు నిండా మునిగి.. కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంది. రహదారులు, పాదచారి మార్గాలకు సంబంధించి మాత్రమే రూ.336 కోట్ల నష్టం వాటిల్లినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు అంచనా వేశారు. నగరవ్యాప్తంగా 396

Published : 24 Sep 2022 01:06 IST

మురికివాడల్లో ఎదురైన ఇక్కట్లపై ‘లెక్క’ తేలేదెన్నడు?

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగరం జులై నుంచి సెప్టెంబరు వరకు కురిసిన వర్షాలకు నిండా మునిగి.. కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంది. రహదారులు, పాదచారి మార్గాలకు సంబంధించి మాత్రమే రూ.336 కోట్ల నష్టం వాటిల్లినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె అధికారులు అంచనా వేశారు. నగరవ్యాప్తంగా 396 కిలోమీటర్ల పొడవైన రహదారులు పాడైనట్లు గుర్తించారు. గుంతలు పడిన చోట్ల వాహన సంచారం కష్టంగా మారింది. వాటిని తక్షణం మరమ్మతు చేయించాలంటే కనీసం రూ.100 కోట్లు అవసరమని అధికారులు వెల్లడించారు. 7941 నివాస గృహాలు ముంపుపాలైనా.. వాటి నష్టాన్ని ఇంకా లెక్కించలేదు. ఇళ్లలో తడిసిన ఆహార ధాన్యాలు, దుస్తులు లెక్కించి ఇంటికి రూ.10 వేలు చొప్పున రూ.13.63 కోట్ల పరిహారం అందించారు. కార్లు, ద్విచక్రవాహనాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల నష్టాన్ని లెక్కించలేదని అధికారులు తెలిపారు. విల్లాలు, అపార్ట్‌మెంట్లలో రెండు మూడు రోజులపాటు కార్లన్నీ నీటిలో మునిగాయి. ఆ వాహనాల పునఃవినియోగానికి వీలుకాదు. సామాన్యంగా నగరంలో ఏడాదికి 70 నుంచి 80 రోజుల పాటు వర్షం కురుస్తుంది. ఈఏడాది గతంలో ఎప్పుడు లేని విధంగా 145 రోజులు వానదేవుడు తిష్టవేశాడు. చెరువులు పూర్తిగా నిండి అలుగులు పారాయి. లోతట్టు ప్రదేశాలు ముంపుపాలయ్యాయి. గురురాజ లేఔట్‌, యమలూరు, బెళత్తూరు, దక్షిణ పినాకిని, సాదరమంగల, బసవణ్ణనగర, చెన్నప్పనహళ్లి, మున్నెకోళలు, శాంతినికేతన్‌ లేఔట్‌, పాపయ్యరెడ్డి లేఔట్‌, వాగ్దేవి లేఔట్‌, చెన్నసంద్ర ప్రధాన రహదారి, సాయి లేఔట్‌, పై లేఔట్‌, గెద్దలహళ్లి, రైల్వే కింద వంతెన, వడ్డరపాళ్య, రెయిన్‌ బో లేఔట్‌, సన్నిబ్రూక్స్‌ లేఔట్‌, డియో లేఔట్‌, అనుగ్రహ లేఔట్‌, వాజపేయి నగర, రామయ్య నగర, ఇబ్బలూరు, మంగమ్మనపాళ్య, హొంగసంద్ర, బిళేకహళ్లి, అరెకెరె, ఫయాజాబాద్‌, యలచేనహళ్లి ఈ ముంపు కారణంగా నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించినా.. నష్టం అంచనాలకు అందనదిగా భావిస్తున్నారు. రాజకాలువల ఆక్రమణలు తొలగించి కాలువ మరమ్మతులకు రూ.300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

విల్లాలు మునిగినా.. నష్ట లెక్కింపులో ఇంకా జాప్యమే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని