logo

రాజకీయాల వక్ర దృష్టి

రాష్ట్రాన్ని పట్టిపీడించిన అతివృష్టి నష్టం తెరమరుగైంది. నిండా మునిగిన బెంగళూరు ప్రజల ఇక్కట్లేవీ పాలకులకు కానరాని నేపథ్యం. దసరా నవరాత్రుల పండుగ ముంగిట రాష్ట్ర రాజకీయాలు నలుపు రంగు పులుముకున్నాయి. పాలన గడపలో ఏలికల

Published : 25 Sep 2022 03:14 IST

బెంగళూరు వీధుల్లో పేసీఎం పోస్టర్లు అంటిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్‌

రాష్ట్రాన్ని పట్టిపీడించిన అతివృష్టి నష్టం తెరమరుగైంది. నిండా మునిగిన బెంగళూరు ప్రజల ఇక్కట్లేవీ పాలకులకు కానరాని నేపథ్యం. దసరా నవరాత్రుల పండుగ ముంగిట రాష్ట్ర రాజకీయాలు నలుపు రంగు పులుముకున్నాయి. పాలన గడపలో ఏలికల అక్రమ వ్యవహారాలపైనే నేడు చర్చంతా!

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : రాష్ట్ర రాజకీయాల రూపురేఖలు మారిపోతున్నాయి. అక్రమ వ్యవహారాలపై రాజకీయ ‘వక్ర’దృష్టి పడింది. ‘పే సీఎం’ పోస్టర్లతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అధికార పార్టీపై తన పోరును ముమ్మరం చేశారు. ప్రతి నియోజకవర్గానికీ కనీసం పది వేల పోస్టర్లతో జాగృతి కల్పించాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. భాజపాకు పట్టున్న వార్డులు, పార్టీ కార్యాలయాలు, బస్టాప్‌లు, కళాశాలలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాల్లో గోడ పత్రాలను అంటించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సమాయత్తమయ్యాయి. కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కార్యకర్తలను అరెస్టు చేస్తే తామే స్వయంగా పోస్టర్లు అంటిస్తామంటూ విధానసభలో విపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ముందడుగు వేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులందరూ గోడపత్రాలను అంటించేందుకు సన్నాహాలు చేపట్టారు. రహదారులకు ఇరువైపులా గోడపత్రాలను అంటించకూడదన్న నిబంధనలను అతిక్రమించకుండా అనుమతి తీసుకున్న హోర్టింగ్‌లు, ఆటోలు, ఇతర వాహనాలపై పే సీఎం, 40% సర్కారు వెబ్‌సైటు వివరాలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు టోపీలు, టీషర్టులు, చేతి గడియరాలపై ‘అక్రమ వ్యవహారాల’చిత్రాలు ముద్రించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. కొడగు జిల్లా విరాజపేట గడియార స్తంభానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు శనివారం గోడపత్రాలు అంటించడం దుమారం రేపింది. ఎగువ, దిగువ సభల్లో మూడు రోజుల పాటు ప్రభుత్వాన్ని ఈ పోస్టర్లతో విపక్షాలు అడ్డుకున్నాయి. వారి ఆరోపణలకు బదులివ్వలేక, చివరి రోజైన శుక్రవారం ఎగువ సభలో భాజపా ఎమ్మెల్సీలు కొన్ని పోస్టర్లను ప్రదర్శించారు. కాంగ్రెస్‌ పార్టీను అడ్డుకునేందుకు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ ‘స్కామ్‌ రామయ్య’ పేరిట చిరు పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకాన్ని ముద్రించి, ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భాజపా యోచించింది. అందులో ఎటువంటి సమగ్ర సమాచారం లేకపోవడంతో దాన్ని ప్రతులుగా ముద్రించి ప్రజల్లోకి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని పార్టీ శ్రేణులు ఆగిపోయాయి. మూడేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఆరోపణలు చేస్తూ వచ్చిన అధికార పార్టీ ఎలాంటి దర్యాప్తునకూ ఆదేశించలేదని సిద్ధరామయ్య అధికార పార్టీపై ప్రశ్నల్ని సంధించారు. వాటికి అధికార పార్టీ నుంచి ఇప్పటికీ బదులు రాలేదు. విపక్షంలో ఉన్నప్పుడు భాజపా అనుసరించిన ప్రచార విధానాలనే కాంగ్రెస్‌ ఇప్పుడు అనుసరిస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఎక్కువ మంది యువత నాజూకు చరవాణులను ఉపయోగిస్తూ ఉండడం, కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చిన అంశంగా మారింది. భారత్‌ జోడో యాత్ర, సిద్ధరామయ్య చేపట్టనున్న రథయాత్ర సమయంలో ‘పే సీఎం’ ప్రచారాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. కొత్తగా రూపొందించిన ‘40 శాతం సర్కార్‌’ వెబ్‌సైటును ఇప్పటికే లక్షన్నర మందికిపైగా చూశారని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ‘పేసీఎం’ ప్రచారాన్ని అడ్డుకోలేని భాజపా నాయకుల తీరుపై హైకమాండ్‌ గుర్రుగా ఉంది. ఎలాగైనా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఇప్పటికే సూచనలు చేసింది.

చెత్త రాజకీయాలు : బొమ్మై

ప్రభుత్వానికి వస్తున్న పేరు ప్రతిష్ఠలను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ‘చెత్త రాజకీయాలు’ చేస్తోందని ముఖ్యమంత్రి బొమ్మై విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేయడం, దాఖలాలు విడుదల చేయకుండా తప్పించుకోవడం విపక్షాలకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని విమర్శించారు. నైతికత లేకుండా, తనపేరును, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. డర్టీ పాలిటిక్స్‌తో మరోసారి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్‌ పార్టీ ఆశ నెరవేరదని అన్నారు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుత్తేదారుల సంఘం.. కాంగ్రెస్‌ స్పాన్సర్‌ సంస్థ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

నెలమంగలలో భాజపా కార్యాలయం వద్ద అంటించిన గోడపత్రికలు

విద్యార్థులకు ఇక్కట్లు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : నెలమంగలలో భాజపా కార్యాలయం, బస్టాప్‌లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘పే సీఎం’ పోస్టర్లు అంటించిన ముగ్గురు విద్యార్థులను పట్టణ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. యువజన కాంగ్రెస్‌ తాలూకా అధ్యక్షుడు నారాయణగౌడ, కార్మిక విభాగం అధ్యక్షుడు రామకృష్ణను శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారం అధారంగా విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి జామీను కోసం పార్టీ నాయకులు స్థానిక న్యాయస్థానం ముందు అర్జీ వేసుకున్నారు.

లింగాయతులపైనే కక్ష

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : లింగాయత సామాజికవర్గం నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే కాంగ్రెస్‌ నేతలు సహించడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి దశలో లింగాయతులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని నిందించారు. ఆ సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రులు వీరేంద్రపాటిల్‌, కెంగల్‌ హనుమంతయ్య తదితరులకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని పదవుల్లోంచి దించారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి వ్యతిరేకంగా అదే తరహా కుట్ర మొదలైందని నిప్పులు చెరిగారు.

బెంగళూరులో కాంగ్రెస్‌ కీలక నేతలతో డీకే శివకుమార్‌ సమాలోచనలు​​​​​​​

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అక్రమాలకు సంబంధించిన

గోడ పత్రాలతో భాజపా ఎమ్మెల్సీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని