రౌడీ.. రాజకీయ దర్బార్
విధానసభకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్న వారు తమకు ఆశ్రయం ఇచ్చే రాజకీయ పార్టీల్లోకి చేరేందుకు మునిగాళ్లపై నిలిచారు.
ఇటీవలే బెంగళూరులో భాజపాలో చేరిన ఫైటర్ రవి (ఎడమనుంచి మొదటి వ్యక్తి)
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : విధానసభకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్న వారు తమకు ఆశ్రయం ఇచ్చే రాజకీయ పార్టీల్లోకి చేరేందుకు మునిగాళ్లపై నిలిచారు. కమలనాథుల తీరు చూస్తుంటే అధోలోకపు నేత దావుద్ ఇబ్రహీంనూ పార్టీలో చేర్చుకునేలా ఉందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయడం కలకలం రేపింది. ‘భాజపాలో గతంలో వైట్ కాలర్ నేరగాళ్లు ఉండేవారు. ఇప్పుడు రియల్ రౌడీలు రాజ్యమేలుతున్నారు’అంటూ మరో ట్వీటులో అగ్నికి ఆజ్యం పోసింది. ‘వాంటెడ్ జాబితాలో ఉన్న నేరగాళ్లు ఎవరూ పోలీసులకు దొరకరు. వారంతా భాజపా నాయకులతో కలిసి తిరుగుతుంటారు. దొంగలు, అబద్ధాలకోరులు, అవినీతిపరులు, రౌడీషీటర్లు అందరికీ ఒకే చోట ఆశ్రయం- అదే భాజపా’ అంటూ మరో ట్వీటులో తూర్పారబట్టింది. పలు నేరారోపణలు ఉన్న సునీల్ అలియాస్ సైలెంట్ సునీల్ ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో లోక్‌సభ సభ్యులు పి.సి.మోహన్ (బెంగళూరు సెంట్రల్), తేజస్వి సూర్య (బెంగళూరు దక్షిణ) పాల్గొన్నారు. రక్తదాతలకు ప్రమాణ పత్రాలు అందించారు. సేకరించిన రెండు వేల యూనిట్ల రక్తాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే రాష్ట్రోత్థాన రక్తనిధికి అందజేశారు. తనకు అవకాశం వస్తే భాజపా టికెట్‌పై చామరాజపేట నుంచి పోటీ చేస్తానని సునీల్ ప్రకటించడం ఈ వివాదాన్ని పెద్దది చేసింది. ఆయనపై 35 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భాజపా ప్రధాన కార్యాలయంలో మండ్యకు చెందిన ఫైటర్ రవికి సోమవారం పార్టీ పతాకాన్ని మంత్రులు అశ్వత్థ నారాయణ, నారాయణగౌడ, గోపాలయ్య అందజేశారు. రవిపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీసులు వెతుకుతున్న నేరగాడితో కలిసి చట్టసభ ప్రతినిధులు ఎందుకు తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ‘వాంటెండ్ క్రిమినల్స్ అందరూ ఇప్పుడు భాజపాకు వాంటెడ్’, ‘రౌడీ షీటరును పార్టీలో చేర్చుకుని కర్ణాటక భాజపా కార్యాలయం నేరగాళ్లకు అడ్డాగా మారిపోయింది’, ‘నేరగాళ్లతో భాజపా సంబంధాలు పెంచుకుంటూ వెళితే, రాష్ట్రంలో నేరాలు సంఖ్య తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్నారా హోం మంత్రి గారూ? రౌడీలను నియంత్రించే శక్తి మీకు, మీ శాఖకు లేదా? పోలీసులను మీరే నియంత్రిస్తున్నారా? సీసీబీకి దొరకని రౌడీలు మీ భాజపా నాయకులకు ఎలా దొరుకుతున్నారు?’ అంటూ వరుస ట్వీట్లలో కమలనాథులకు కాంగ్రెస్ వరుస ప్రశ్నలు సంధించింది.
మేం చేర్చుకోలేదు
* సునీల్ అలియాస్ సైలెంట్ సునీల్ భాజపా సభ్యుడు కాదని, ఆయనను పార్టీలో చేర్చుకునే ఆలోచన లేదని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పష్టం చేశారు. సునీల్‌పై కేసులు ఉన్నా, కారాగారంలో శిక్షను అనుభవించి, జామీనుపై వచ్చాడని చెప్పారు. అతను నిర్వహించిన కార్యక్రమంలో భాజపా నేతలు పాల్గొన్న విషయం తన దృష్టికి వచ్చిందని, వారిని త్వరలో వివరణ కోరతానని చెప్పారు. దేశ నిర్మాణంలో భాజపా కీలక పాత్ర పోషిస్తోందని, నేరగాళ్లు, తీవ్రవాదులు, అవినీతిపరులు, సంఘ విద్రోహ శక్తులను తాము పార్టీ, ప్రజల నుంచి దూరంగా ఉంచుతామని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఆదివారం నిర్వహించిన శిబిరంలో రక్తదాతకు కవర్
అందిస్తున్న పి.సి.మోహన్, తేజస్వి సూర్యతో సైలెంట్ సునీల్
కాంగ్రెస్‌లో పరిస్థితేంటి?
* మీ పార్టీలో ఎందరు రౌడీషీటర్లు ఉన్నారో ముందు లెక్క చూసుకోవాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంగళవారం కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర చట్టసభ ప్రతినిధులలో నేరచరిత్ర ఉన్న వారిలో ఎక్కువ మంది మీ పార్టీలోనే ఉన్నారని ఆరోపించారు. సునీల్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో భాజపా నేతలు పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు బొమ్మై స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో నేరచరిత్ర ఉన్న నేతలే లేరా అని విపక్ష నేత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎవరి పార్టీలో ఎందరు నేరగాళ్లు ఉన్నారో లెక్క వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ సవాలు విసిరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Spy Balloon: అమెరికాలో చైనా బెలూన్ కలకలం.. అసలేంటీ ‘స్పై బెలూన్’..?