logo

అల్లుడి విజయమే ఖర్గే ఆశయం

కలబురగి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

Published : 07 May 2024 03:24 IST

కలబురగిలో ఎన్నికలకు సర్వం సిద్ధం

 ఉమేశ్‌ జాదవ్‌

 బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురగి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. భాజపా అభ్యర్థి డాక్టర్‌ ఉమేశ్‌జాదవ్‌ ఆయనను వెనక్కినెట్టి.. భాజపా జెండా ఎగురవేశారు. ఈసారీ జాదవ్‌ బరిలో ఉన్నారు. ఆయనతో తలపడటానికి ఖర్గే బదులు ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని బరిలో నిలిచి.. గట్టి సవాల్‌ విసురుతున్నారు. విజయ సాధనకు వ్యూహాలు, ఎత్తుగడలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. రాధాకృష్ణను గెలిపించుకునే బాధ్యత మామ మల్లికార్జున ఖర్గే, బావమరిది మంత్రి ప్రియాంక్‌ ఖర్గే భుజాలపై వేసుకున్నారు. ఆయన ఓడిపోతే జాతీయ స్థాయిలో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సర్వశక్తులనూ కూడతీసుకుని శ్రమిస్తున్నారు. వివిధ బహిరంగసభల్లో ఖర్గేతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇలా అనేకానక మంది కదలివచ్చి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో మునిగిపోయారు. మరోవైపు ఉమేశ్‌ కోసం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తదితరులూ ప్రచారం చేశారు. మోదీ చరిష్మా ఉపకరిస్తుందని కమలనాథులు లెక్కలుగడుతున్నారు. ఇన్నాళ్లూ భాజపాలో ఉన్న మాజీ మంత్రులు మాలికయ్య గుత్తేదార్‌, బాబురావు చించనసూర ప్రస్తుతం ఖర్గేకు మద్దతుగా నిలిచారు. నియోజకవర్గంలో ‘కోలి’ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని ఎస్‌సీ జాబితాలో చేర్పిస్తానని డాక్టర్‌ ఉమేశ్‌జాదవ్‌ హామీనిచ్చి మోసగించారని బాబురావు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేస్తానని ఈ ఎన్నికల్లో ఖర్గే హామీనిచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు విధానసభ నియోజకవర్గాల్లోనూ రెండు పార్టీలూ బలంగా ఉన్నాయి. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీపడుతున్న కలబురగిలో మంగళవారం ఎన్నికల కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులుగా ఉండటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం, ఎన్నికల తాయిలాలూ రవాణా కాకుండా గట్టి చర్యలకు ఉపక్రమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని