logo

కలం ఎక్కుపెడితేనే సమస్యల పరిష్కారం

పాత్రికేయులు ప్రాంతాలకు పరిమితం కావద్దని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. అఖండ కర్ణాటకలోని సమస్యలను గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Published : 05 Feb 2023 06:27 IST

కారజోళతో కలిసి జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి

విజయపుర, న్యూస్‌టుడే : పాత్రికేయులు ప్రాంతాలకు పరిమితం కావద్దని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. అఖండ కర్ణాటకలోని సమస్యలను గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే సరిపోదని, రాష్ట్రమంతా ప్రగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన 37వ పాత్రికేయుల రాష్ట్ర సమ్మేళనాలలో సీనియర్‌ పాత్రికేయులు బీఎన్‌ మల్లేశ్‌, సుకన్య, శంకర పాగోజీలను సత్కరించి మాట్లాడారు. విలేకరులు, రాజకీయ నాయకులు ఒకరితో మరొకరు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారని విశ్లేషించారు. ప్రజల అభిప్రాయాలను నాయకులకు- నాయకుల ప్రకటనలను ప్రజలకు చేరవేర్చడంలో కీలక పాత్రను పోషిస్తుంటారని చెప్పారు. నిజాయితీతో వ్యవహరించే పాత్రికేయులు, నాయకులను మాత్రమే ప్రజలు అభిమానించి, గౌరవిస్తారని తెలిపారు. మారుతున్న కాలంలో ప్రతి పాఠకుడూ పాత్రికేయునిగా మారిపోయేందుకు సామాజిక మాధ్యమాలు సహకరిస్తున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పాత్రికేయుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విలేకరుల సంఘం ప్రతినిధులు పూర్తి వివరాలు అందిస్తే వారికి బస్సు పాసులను కేటాయించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. విశ్రాంత పాత్రికేయులకు ఇస్తున్న పింఛను పెంచడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దేశానికి అన్నాన్ని అందించే రాష్ట్రంగా కర్ణాటక అభివృద్ధి చెందేలా ప్రభుత్వానికి విలేకరులు సూచనలు ఇవ్వాలని కోరారు. విజయపుర జిల్లా మొదటి నుంచి తనదైన ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. పాలకులకు వివేచన ఉంటే తక్షణమే ఆ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పెద్ద పీట వేస్తారని పేర్కొన్నారు. విలేకరులకు ఇళ్ల స్థలాలు, పాత్రికేయుల భవన్‌ల నిర్వహణ, యశస్విని పథకం పరిధిలోకి కలం వీరులను తీసుకు రావడం, ఇతర సదుపాయాలకు సంబంధించి సంఘం ప్రతినిధులు సీఎంకు వినతిపత్రాన్ని అందించారు. మంత్రులు సీసీ పాటిల్‌, గోవింద కారజోళ, మురుగేశ నిరాణి, సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని