logo

టెకీ కలల వాహనం అదిగో!

ఐటీ, బీటీ కారిడార్‌గా ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలకు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో సేవలను శనివారం అందుబాటులోకి తెస్తారు.

Published : 24 Mar 2023 04:04 IST

విద్యుత్తు కాంతులతో వైట్‌ఫీల్డ్‌ స్టేషన్ 

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఐటీ, బీటీ కారిడార్‌గా ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలకు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో సేవలను శనివారం అందుబాటులోకి తెస్తారు. వైట్‌ఫీల్డ్‌- కేఆర్‌పురం మధ్య 13.77 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. నూతన నిర్మాణంలో లోపాలేవీ లేకుండా పక్షం రోజులుగా నిపుణులు సరిచూశారని బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు వివరించారు. కేంద్ర మెట్రో రైలు సురక్షిత ప్రాధికార కమిషన్‌ చేసిన సూచనల నేపథ్యంలో పలు సవరణలు చేశారు. జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైట్‌ఫీల్డ్‌కు చేరుకుని.. ఇక్కడి మెట్రో స్టేషన్‌, రైలు సంచారాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేసి విద్యుత్తు దీపాలతో అలంకరించారు. వైట్‌ఫీల్డ్‌ నుంచి కేఆర్‌పురం మార్గంలో బెన్నిగానహళ్లి, గరుడాచార్యపాళ్య, కె.ఆర్‌.పురం, హుడీ, మహదేవపుర, సీతారామాపాళ్య, కుందనహళ్లి, నల్లూరుహళ్లి, సత్యసాయి ఆసుపత్రి, పట్టందూరు అగ్రహార, కాడుగోడి, చెన్నసంద్ర, వైట్‌ఫీల్డ్‌ మెట్రో స్టేషన్లకూ వన్నెలద్దారు. వంతెనల కింద మొక్కలు నాటారు. స్తంభాలకు చక్కని రంగులు వేశారు. పాదచారులు రహదారి దాటేందుకు ఏర్పాట్లున్నాయి. ఈ మార్గంలో రైలు 70 కిలోమీటర్ల వరకు వేగంతో పరుగులు తీస్తుంది. మలుపుల వద్ద ఈ వేగాన్ని 40 కిలోమీటర్లకే పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున ఐదింటి నుంచి రాత్రి 11 వరకు నాజూకు వాహనం ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఆయా ప్రాంగణాలకు వచ్చి వాలుతుంది. రెండు స్టేషన్ల మధ్య సంచార సమయాన్ని 22 నిమిషాలుగా అంచనా వేస్తున్నారు. ప్రయాణ ఛర్జి రూ.35గా నిర్ణయించారు. 26న ప్రయాణికుల కోసం ద్వారాలు తెరుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని