logo

గెలిచిన ప్రతిసారీ తంగడిగికి మంత్రి గిరి

కనకగిరి నుంచి గెలిచిన ప్రతిసారి శివరాజ్‌ తంగడిగికి మంత్రి యోగం తప్ప లేదు. ఆయన ఇప్పటికి మూడుసార్లు ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

Published : 28 May 2023 02:02 IST

బెంగళూరులో తంగడిగి నివాసం వద్ద అభిమానుల సందడి

గంగావతి,న్యూస్‌టుడే: కనకగిరి నుంచి గెలిచిన ప్రతిసారి శివరాజ్‌ తంగడిగికి మంత్రి యోగం తప్ప లేదు. ఆయన ఇప్పటికి మూడుసార్లు ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2008లో కనకగిరి ఎస్సీలకు రిజర్వు చేశారు. తొలిసారి ఆయన స్వతంత్రునిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అప్పట్లో యడియూరప్ప ప్రభుత్వానికి స్వతంత్రుల మద్దతు అనివార్యమైంది. ఈనేపథ్యంలో తంగడిని మంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది. 2013లో ఆయన కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. రెండోసారి గెలిచి సామాజికవర్గం ప్రాతిపదికిన సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రయ్యారు. తాజా ఎన్నికల్లో మూడోసారి గెలిచి మళ్లీ సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేశారు. కొప్పళ జిల్లాలో సీనియర్‌ శాసనసభ్యుడు బసవరాజ్ రాయరెడ్డి, ఓటమి ఎరుగని రాఘవేంద్ర హిట్నాళ ఉన్నప్పటికీ అధిష్ఠానం తంగడిగి వైపే మొగ్గు చూపింది.

మంత్రుల బరి కనకగిరి:

కొప్పళ జిల్లాలో కనకగిరికి ఒక విశిష్టత ఉంది. రాయచూరు నుంచి వేరుపడి 1997లో కొప్పళ జిల్లాగా ఏర్పడినప్పటి నుంచీ కనకగిరికి చెందిన వారే అత్యధికంగా మంత్రులు కావడం విశేషం. 1998లో నాగప్ప సాలోణి జిల్లాలో తొలిసారి మంత్రి పదవి అలంకరించారు. ఆయన తరువాత 1999 నుంచి 2004 దాకా మల్లికార్జున నాగప్పకు ఎస్‌.ఎం.కృష్ణ మంత్రి వర్గంలో చేరారు. 2008, 2013లో శివరాజ్‌ తంగడిగికి మంత్రి యోగం పట్టింది. ప్రస్తుతం ఆయనే జిల్లా బాధ్య మంత్రి కావడం గమనార్హం. మధ్యలో ఒకసారి 2017లో యలబుర్గాకు చెందిన రాయరెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని