logo

ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ

తాను ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.

Published : 18 Apr 2024 02:41 IST

కుమారస్వామి

మండ్య, న్యూస్‌టుడే : తాను ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు మఠాధిపతుల, నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేయించానని వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి ఆరోపించడాన్ని ఖండించారు. కుమార మంగళవారం మండ్యలో విలేకరులతో మాట్లాడుతూ ఆదిచుంచనగిరి మఠాధిపతితో కలిసి నేను అమెరికా వెళ్లిన సమయంలో ఆనంద్‌సింగ్‌ రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఇదే విషయమై డీకే శివకుమార్‌, ఇతర నేతలతో మాట్లాడినప్పుడు- తాము ప్రభుత్వం పతనం కాకుండా చూస్తామని చెప్పారని, ఆ తర్వాతే ఒక్కరొక్కరే పార్టీని వీడడంతో ప్రభుత్వం పతనమైందనన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి- డీకే శివకుమార్‌ మధ్య గొడవలు ఎందుకు తలెత్తాయో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అధికారం, డబ్బు ఉందని శివకుమార్‌ దురంహకారంతో వ్యవరిస్తూ, పెద్దా, చిన్నా చూడకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం నన్నే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తోందన్నారు.


కుమారకు ‘దర్శన్‌’ సెగ

మండ్య: మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జనతాదళ్‌, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న హెచ్‌డీ కుమారస్వామికి వ్యతిరేకంగా నటుడు దర్శన్‌ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి స్టార్‌ చంద్రుకు మద్దతుగా మళవళ్లిలో గురువారం నుంచి ఆయన ప్రచారం చేస్తారు. గత ఎన్నికల్లో సుమలతకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని చేసి, ఆమెను గెలిపించడంలో కీలక పాత్రను పోషించారు. సుమలత ఇప్పుడు భాజపాలో చేరడంతో, స్టార్‌ చంద్రు తరఫున ప్రచారాన్ని చేయాలని నిర్ణయించినట్లు దర్శన్‌ తెలిపారు.


భవిష్యత్తు కోసమే పోటీ

ఈశ్వరప్ప

శివమొగ్గ, న్యూస్‌టుడే : నాకు అసెంబ్లీ సీటు.. కుమారునికి లోక్‌సభ సీటు ఇవ్వకుండా భాజపా మోసగించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప తప్పుపట్టారు. పార్టీ వ్యవహారం నచ్చక- నా భవిష్యత్తు కోసమే శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగానని ప్రకటించారు. పోటీ చేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉండదని అర్థమైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి, ప్రధాని మోదీని కలుస్తానని ప్రకటించారు. ప్రపంచం గుర్తించిన మోదీకి తాను మొదటి నుంచి అభిమానని చెప్పారు. జనతాదళ్‌తో పొత్తుకు సంబంధించి తన వద్ద ఎటువంటి వివరాలు లేవన్నారు. కర్ణాటకలో భాజపా దీన స్థితికి చేరుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కారణమని దుయ్యబట్టారు. అధికారం ఉందని అప్ప తనయులు రాఘవేంద్ర, విజయేంద్ర నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో భాజపా బలోపేతం అయ్యేందుకు యడియూరప్ప, అనంతకుమార్‌, తాను 40 ఏళ్లు పోరాటం చేశామన్నారు. ఇప్పుడు తనను నిర్లక్ష్యంగా పక్కకు తోసేసి, యడియూరప్ప చేస్తున్న రాజకీయాలు సరైనవి కావన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని