logo

వేటకత్తితో నరికి.. భార్యను చంపిన భర్త

భూస్వాధీనం చేసుకున్న భూమికి పరిహారంగా ప్రభుత్వం అందించిన రూ.2 కోట్లను పుట్టింటికి పంపించిన జయలక్ష్మి (36) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త శ్రీనివాస్‌ (38)ను దాబస్‌పేట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

Published : 05 May 2024 04:16 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : భూస్వాధీనం చేసుకున్న భూమికి పరిహారంగా ప్రభుత్వం అందించిన రూ.2 కోట్లను పుట్టింటికి పంపించిన జయలక్ష్మి (36) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త శ్రీనివాస్‌ (38)ను దాబస్‌పేట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నెలమంగల తాలూకా గొట్టిగెరెకు చెందిన శ్రీనివాస్‌కు దాబస్‌పేట పారిశ్రామికవాడలో ఎకరం భూమి ఉంది. దాన్ని స్వాధీనపరచుకున్న ప్రభుత్వం ఆయనకు రూ.2 కోట్లకు పైగా పరిహారాన్ని అందించింది. అందులో రూ.2 కోట్లను ఆమె తన పుట్టింటి వారి అవసరాలకు పంపించింది. ఇదే విషయమై దంపతుల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. భార్యపై దాడి చేసి వేటకత్తితో హత్య చేశాడు. మృతదేహాన్ని ఇంటి వెనుక పెరట్లో పూడ్చి పెట్టేందుకు గుంత తీస్తున్న సమయంలో అతని పిల్లలు చూసి నిలదీశారు. మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న జయలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలించిన పోలీసులు నిందితుడిని శనివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.


బాలికను గర్భిణిని చేసిన యువకుడిపై కాల్పులు

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : వివాహం చేసుకుంటానని ఒక బాలిక (17)ను గర్భిణిని చేసి పరారైన సద్దాం హుసేన్‌ (23) అనే నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నారు. సుతగట్టి సమీపంలో నిందితుడ్ని శుక్రవారం అర్ధరాత్రి అదుపులోనికి తీసుకునేందుకు వెళ్లిన నవనగర ఠాణా పోలీసులపై ఎదురుదాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఓ పోలీస్‌ అధికారి గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాలని హెచ్చరించినా ఆగకపోవడంతో నేరుగా కాల్పులు జరిపి పట్టుకున్నామని నగర పోలీసు కమిషనర్‌ రేణుకా సుకుమార్‌ తెలిపారు. నిందితుడు ఈశ్వర నగర నివాసి. అతనితో పాటు దాడిలో గాయపడిన ఒక కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ధార్వాడలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు.


ప్రేమికులను కడతేర్చిన హంతకులకు ఉరి శిక్ష

విజయపుర, న్యూస్‌టుడే : ముద్దేబిహాళలో బాను బేగం అత్తార్‌, సాయబణ్ణ కొణ్ణూర అనే వ్యక్తులను హత్య చేసిన నేరారోపణ నేపథ్యంలో ఇబ్రహీం సాబ్‌, అక్బర్‌ సాబ్‌ అనే నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ విజయపుర జిల్లా రెండో అదనపు న్యాయస్థానం తీర్పు చెప్పింది. హత్యకు సహకరించిన రంజాన్‌ నబి అత్తార, దావలబి జమాదార్‌, అజ్మా దఖని, జిలాని దఖని, అబ్దుల్‌ ఖాదర్‌, దావలబి దన్నూరలకు జీవిత ఖైదు శిక్ష, అందరికీ కలిపి రూ.4.19 లక్షల జరిమానా విధించింది. బాను బేగం అత్తార్‌, సాయబణ్ణ కొణ్ణూర ఇద్దరూ ప్రేమించి 2017లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని బాను బేగం కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. మాట్లాడదాం రమ్మని దంపతులపై దాడి చేసి ఒంటిపై పెట్రోలు పోసి హత్య చేశారు. తాళికోటె ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది.


వేదికపైనే కళాకారుడి గుండె ఆగిపోయింది..

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : నాటకం కొనసాగుతున్న సమయంలో శకుని పాత్ర పోషించిన ఎన్‌.మునికెంపణ్ణ (72) అనే నటుడు గుండెపోటుతో కన్నుమూశారు. యలహంక సమీపంలోని సాతనూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన సంభవించింది. విశ్రాంత ఆచార్యుడైన మునికెంపణ్ణ దేవనహళ్లిలో నిర్వహించిన 28వ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. మునికెంపణ్ణ స్వగ్రామం అరదేశనహళ్లిలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.


విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

మంగళూరు, న్యూస్‌టుడే : మంగళూరు బజ్పె విమానాశ్రయాన్ని పేల్చి వేస్తామంటూ ఒక నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. విమానాశ్రయానికి సంబంధించిన ఇ-మెయిల్‌ ఐడీకి నిందితుడు బెదిరింపు సందేశాన్ని పంపించాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం ఆవరణలో పోలీసులు, బాంబు నిష్క్రియ దళం సిబ్బంది సోదాలు నిర్వహించి, అది ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చారు.


ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

దావణగెరె, న్యూస్‌టుడే : హొన్నాళి తాలూకా అరకెరె సమీపంలోని సూరనహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో శివమొగ్గకు చెందిన వేదమూర్తి (60), ఆయన తల్లి శారద (79) అనే వారు మరణించారు. వారి కుటుంబానికి చెందిన మరో ముగ్గురు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని