logo

అమ్మా.. అమ్మా.. నీకేం కాదమ్మా: గుండెల్ని మెలిపెట్టిన బాలుడి తాపత్రయం

‘అమ్మా, అమ్మా.. ఏం కాదమ్మా, నీకేం కాదమ్మా.. అంకుల్‌ కాస్త నీళ్లుంటే ఇవ్వరా! అమ్మ జుత్తు పైకని కాస్త కడగరా.. ఏమనుకోకండి అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌.. ప్లీజ్‌’’ అంటూ ఓ 12 ఏళ్ల బాలుడు పడ్డ తాపత్రయం గుండెల్ని మెలిపెట్టింది.

Updated : 27 Nov 2022 14:32 IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: ‘‘అమ్మా, అమ్మా.. ఏం కాదమ్మా, నీకేం కాదమ్మా.. అంకుల్‌ కాస్త నీళ్లుంటే ఇవ్వరా! అమ్మ జుత్తు పైకని కాస్త కడగరా.. ఏమనుకోకండి అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌.. ప్లీజ్‌’’ అంటూ ఓ 12 ఏళ్ల బాలుడు పడ్డ తాపత్రయం గుండెల్ని మెలిపెట్టింది. అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉన్న తండ్రి ఛాతీపై రక్తాన్ని దస్తీతో తుడుస్తూ, తల్లి వైపు పరుగులు పెడుతూ ఆమె ముఖంపై ధారాపాతంగా కారుతున్న నెత్తురును శుభ్రం చేస్తూ ‘అమ్మా నీకేం కాదంటూ’ ధైర్యం చెప్పాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ, తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, చేతిలో ఉన్న ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం అయ్యో పాపం అనిపించింది.

మణుగూరు మండలం విజయనగరం గ్రామం సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాద సమయంలో పరిస్థితి ఇది. శివలింగాపురం గ్రామానికి చెందిన కె.సత్యనారాయణ, భార్య, కుమారుడితో కలిసి స్కూటీపై కొండాయిగూడెం నుంచి మణుగూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో లారీ, స్కూటీని అధిగమించబోయి గట్టిగా ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణతోపాటు, భార్య లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు నవదీప్‌కి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని మణుగూరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. సత్యనారాయణ ఓసీ-2లో సింగరేణి కార్మికుడు. ప్రమాద సమయంలో 12 ఏళ్ల నవదీప్‌ తల్లిదండ్రులు అచేతన స్థితిని చూసి తల్లడిల్లిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని