logo

పరీక్ష ఆలస్యం.. ఆరోగ్యం విషమం

ఖమ్మం గ్రామీణం మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళ రొమ్ముపై గడ్డలు ఏర్పడటంతో మూణ్నెల్ల క్రితం జిల్లా జనరల్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది.

Published : 04 Feb 2023 04:37 IST

జిల్లా ఆసుపత్రుల్లో ‘క్యాన్సర్‌’ నిర్ధారణ ఏర్పాట్లు అవసరం
కొత్తగూడెం వైద్యవిభాగం, ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

* ఖమ్మం గ్రామీణం మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళ రొమ్ముపై గడ్డలు ఏర్పడటంతో మూణ్నెల్ల క్రితం జిల్లా జనరల్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. శస్త్రచికిత్స వైద్య నిపుణులు స్క్రీనింగ్‌ అనంతరం పరీక్ష (ఎఫ్‌ఎన్‌ఏసీ) చేయించగా క్యాన్సర్‌ ప్రాథమిక దశగా నిర్ధారణైంది. చికిత్స కోసం హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆసుపత్రికి సిఫార్సు చేశారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 42 ఏళ్ల మహిళ రొమ్ము భాగంలో కణతులు ఏర్పడటంతో ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించారు. మందులు వాడినా తగ్గకపోవడంతో వైద్యులు నమూనా సేకరించి బయాప్సీకి పంపారు. నివేదికలో క్యాన్సర్‌గా తేలడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు.

* కొత్తగూడెంకు చెందిన మహిళ (29) గొంతు నొప్పి సమస్యతో సింగరేణి ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అనుమానం వచ్చిన వైద్యులు ఖమ్మంలోని ప్రైవేటు వైద్య కళాశాలకు పంపగా.. అక్కడి ప్రాథమిక పరీక్షల్లో థైరాయిడ్‌ క్యాన్సర్‌గా తేలింది. నమూనా సేకరించి హైదరాబాద్‌కు పంపారు. ఆమె రాజధానిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఉభయ జిల్లాల్లో వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వ్యాధి కచ్చిత నిర్ధారణకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఏ ఆసుపత్రిలో లేదు. ఖమ్మంలోని జిల్లా ఆసుపత్రిలో స్క్రీనింగ్‌ సదుపాయం ఉంది. కానీ ల్యాబ్‌లో బయాప్సీ అవకాశం లేదు. కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆసుపత్రి, సింగరేణి ఆసుపత్రుల్లో కనీసం స్క్రీనింగ్‌ పరీక్షలకూ ఏర్పాట్లు లేవు. దీంతో హైదరాబాద్‌కు సిఫార్సు చేయకతప్పడం లేదు. రోగులు వ్యయప్రయాసలు కోర్చి అంతదూరం వెళ్లిరాక తప్పని పరిస్థితి. సర్వజన ఆసుపత్రిలో బయాప్సీ నమూనాల సేకరణ, పరీక్ష ఫలితాలు వెల్లడించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ప్రమాద ఘంటికలు..

* శరీరంపై ఏర్పడే గడ్డల్లో క్యాన్సర్‌ లక్షణాలు గుర్తించేందుకు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గత ఏడాది ‘సైటాలజీ’ ల్యాబ్‌ ఏర్పాటైంది. ఇక్కడ గడ్డల్లోని నీటి నమూనాలు సేకరించి సూది పరీక్షలు చేస్తారు. గత నవంబరు నుంచి ఇప్పటివరకు 230 కేసులను పరీక్షించగా 15 మందిలో క్యాన్సర్‌ లక్షణాలు నిర్ధారణయ్యాయి.

* 2022-23లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంలో ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా జరిపిన పరీక్షల్లో 103 నోటి, 121 రొమ్ము, 76 మందికి సర్వైకల్‌ క్యాన్సర్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు.

‘పాలియేటివ్‌ కేర్‌’లో ఉపశమనం

జిల్లా ఆసుపత్రుల్లోని పాలియేటివ్‌ కేంద్రాల్లో క్యాన్సర్‌ బాధితులకు హోం కేర్‌ సేవలందిస్తున్నారు. మొత్తం 15 పడకల చొప్పున ఏర్పాటు చేశారు. రోగులకు ఇన్‌పేషంట్గా సేవలు కొనసాగిస్తున్నారు. ‘ఆలన’ వాహనం ద్వారా కేంద్రానికి తరలిస్తూ ఊరట కలిగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో 16 వేల మంది చికిత్స పొందారు. పడకలు మరిన్ని పెంచాలని రోగుల కుటుంబాలు కోరుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు