logo

భాజపాను సాగనంపాలి: మాణిక్‌రావ్‌ ఠాక్రే

ప్రధాని మోదీ అరాచకాలను అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు, పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే అన్నారు.

Published : 27 Mar 2023 04:02 IST

కేసీఆర్‌కు వీఆర్‌ఎస్‌ ఇవ్వాల్సిందే: రేణుక

వైరా, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ అరాచకాలను అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు, పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే అన్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న రాహుల్‌ గాంధీకి ప్రజల ఆదరణ, మద్దతు పెరుగుతుండటంతో మోదీకి, భాజపాకు భయం పట్టుకుందన్నారు. తప్పుడు కేసులు బనాయించి రాహుల్‌కు శిక్షలు వేయించిన మోదీ మరీ దిగజారుతున్నారన్నారు. రాహుల్‌కు మద్దతుగా పార్టీ ఎంపీలు రాజీనామా చేసి అండగా నిలవాలన్నారు. అదానీ రూ.వేల కోట్లు దోచుకుని కార్పొరేటు శక్తిగా మారి భాజపాకు నిధులు సమకూర్చుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మోదీకి అడ్డుకట్ట వేయకుంటే దేశానికి ఎంతో ప్రమాదమన్నారు. దోచుకునే వారిని వెతికిమరీ రూ.వేల కోట్లు కట్టబెడుతున్న భాజపా సర్కారును సాగనంపాలన్నారు. విపక్ష పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం రాహుల్‌కు మద్దతు పలికారని, అన్ని రాష్ట్రాల నుంచి పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందన్నారు.

మంత్రి అజయ్‌ అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది: ప్రజల కోసం రాహుల్‌ గాంధీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నారని, మోదీ పిచ్చి చేష్టలకు ఏ కాంగ్రెస్‌ కార్యకర్త బెదిరే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపాకు చిరునామా లేదని, భారాస చిరునామా మారిపోతుందన్నారు. కేసీఆర్‌ పాలనలో సర్పంచులు అప్పులపాలయ్యారని ఆయనకు వీఆర్‌ఎస్‌ ఇవ్వాల్సిందేనన్నారు. దుయ్యబట్టారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేసే అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని, కొండలను కరగదీసి భూములు లాక్కుంటున్నారన్నారు. ఆడబిడ్డగా జిల్లా కాంగ్రెస్‌ను బతికించే బాధ్యత తనదేనన్నారు. ప్రజలు సైతం నిజాయితీగా ఓట్లు వేయాలని నోటుకు అమ్ముడుపోతే ఎంతో వెనక్కిపోతామన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ను ఆదరించారని, ఈసారీ ఎంపీతోపాటు అన్ని స్థానాలు కాంగ్రెస్‌కే దక్కడం ఖాయమన్నారు. టీపీసీసీ సభ్యుడు ధరావత్‌ రామ్మూర్తినాయక్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, పీసీసీ ప్రొటోకాల్‌ ప్రధాన కార్యదర్శి వేణు, సుష్మా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు యడవల్లి కృష్ణ, మానుకొండ రాధాకిషోర్‌, మానవతారాయ్‌, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సూరంపల్లి రామారావు, మాధవరెడ్డి, అఫ్జల్‌, పగడాల మంజుల, కట్ల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా యాత్ర: సభకు ముందు పట్టణంలో జోడో యాత్ర ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప క్షేత్రం నుంచి పాత బస్టాండ్‌, క్రాస్‌రోడ్డు మీదుగా తల్లాడ రోడ్డు సభావేదిక వద్దకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి స్వయంగా ట్రాక్టర్‌ నడపగా ఠాక్రే వాహనంపై ఎక్కి సందడి చేశారు. దారి పొడవునా కార్యకర్తలు పూలు చల్లుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. రేణుక ట్రాక్టర్‌ నడుపుతుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. క్రాస్‌రోడ్డులో జిల్లా కేంద్రానికి చెందిన పార్టీ నాయకుడు ముస్తఫా కాలిపై ట్రాక్టర్‌ టైరు ఎక్కింది. అతడి పాదానికి గాయం కావటంతో ఖమ్మంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుణ్ని రేణుక పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని