logo

విద్యుదాఘాతంతో కార్మికుడి మృత్యువాత

విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంతో అన్‌మ్యాన్డ్‌ కార్మికుడు విద్యుదాఘాతానికి గురైన సంఘటన ఖమ్మం నగరంలోని ఐటీ హబ్‌ ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 03 Jun 2023 03:32 IST

యాకూబ్‌పాషా

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంతో అన్‌మ్యాన్డ్‌ కార్మికుడు విద్యుదాఘాతానికి గురైన సంఘటన ఖమ్మం నగరంలోని ఐటీ హబ్‌ ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన కార్మికుడికి అందరూ సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలిపేందుకు ప్రయత్నించినా కోలుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషాదకర ఘటన పూర్తి వివరాలు ఇవి... ఐటీ హబ్‌లో విద్యుత్తు సమస్య తలెత్తిందంటూ ఇల్లెందు క్రాస్‌రోడ్డు ఉప కేంద్రానికి సమాచారం అందింది. లైన్‌మెన్‌ విజయ్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ శరత్‌, అన్‌మ్యాన్డ్‌ కార్మికుడు షేక్‌ యాకూబ్‌పాషా(42) మరమ్మతు చేసేందుకు అక్కడికి వెళ్లారు. రెండు ఏబీ స్విచ్చుల్లో ఒకటి ఆఫ్‌ చేసి చేసిన లైన్‌మెన్‌, 11 కేవీ తీగల వద్ద మరమ్మతు చేసేందుకు యాకూబ్‌పాషాని ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర విద్యుదాఘాతానికి గురైన పాషా అక్కడి నుంచి పడిపోయారు. కాలిన గాయాలతో అతను అపస్మారక స్థితికి చేరారు. దీంతో అక్కడే ఉన్న లైన్‌మెన్‌ విజయ్‌, మరికొందరు కలిసి అతనికి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. గుండెను పంపు చేస్తూ, నోటితో గాలి ఊదుతూ, కాళ్లూ చేతులు రుద్దుతూ తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు కోలుకున్న అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే అతనికి తిరిగి శ్వాస సమస్య తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం మమత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పాషా మృతి చెందినట్లు ఏడీఈ రమేశ్‌ తెలిపారు. ఖానాపురంలో నివసించే పాషాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా...

విద్యుదాఘాతంతో అపస్మారక స్థితికి చేరిన పాషాకు సీపీఆర్‌ చేస్తున్న లైన్‌మెన్‌ విజయ్‌ (కళ్లజోడు వ్యక్తి), నోటితో గాలి అందిస్తున్న మరో వ్యక్తి

ఐటీ హబ్‌లో అంతర్గతంగా విద్యుత్తు సమస్యలు తలెత్తాయి. వీటిని గుర్తించలేని ఐటీ హబ్‌ ఎలక్ట్రీషియన్లు విద్యుత్తు సమస్య అంటూ సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరమ్మతుల సమయంలో రెండు ఏబీ స్విచ్చులను ఆఫ్‌ చేయాల్సి ఉన్నా లైన్‌మెన్‌, జేఎల్‌ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కదాన్నే ఆపేయడంతో విద్యుదాఘాతం ఏర్పడింది. నిబంధనల ప్రకారం మరమ్మతు కూడా లైన్‌మెన్లే చేయాల్సి ఉంది. అలాగే పని ప్రదేశంలో ఉపయోగించాల్సిన ఎర్త్‌ రాడ్‌ను ఉపయోగించలేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైందని అన్‌మ్యాన్డ్‌ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంస్థపరంగా విచారణ జరుపుతామని ఏడీఈ రమేశ్‌ తెలిపారు.

వరుస ఘటనలు...

ఐటీ హబ్‌లో వరుసగా రెండు సంఘటనలు జరగడం చర్చనీయాంశమైంది. హబ్‌లో వాచ్‌మెన్‌గా పని చేసే బాసిపొంగు ప్రభాకర్‌(44) బుధవారం(మే 31న) విధుల్లో ఉండగా రక్తపు వాంతులతో పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండో రోజే విద్యుదాఘాతంతో మరొకరు మృతి చెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని