logo

ప్రవేశాల పెంపుపైౖ దృష్టి

ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఈనెల 1న పునః ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పుడిప్పుడే కళాశాలల బాట పడుతున్నారు.  

Published : 07 Jun 2023 03:51 IST

ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్న అధ్యాపకులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే : ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఈనెల 1న పునః ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పుడిప్పుడే కళాశాలల బాట పడుతున్నారు.  మొదటి సంవత్సరం ప్రవేశాలు మొదలైనప్పటికీ మందకొడిగా సాగుతున్నాయి. ప్రవేశాల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇంత వరకు ఊపందుకోలేదు. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ అనుబంధ యాజమాన్యాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఆదర్శ కళాశాలలు, కేజీబీవీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గ్రామీణ విద్యార్థులు వసతిగృహం అవకాశం ఉన్న కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. శనివారం వరకు గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం ఉంది. తర్వాత అక్కడ ప్రవేశం లభించని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లాలో..

పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు ప్రవేశాల సంఖ్య పెంచేందుకు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల పేర్లు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విషయం గురించి ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు, ఎంసెట్‌ శిక్షణ, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విశాలమైన క్రీడా మైదానాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు తదితర వాటి గురించి అవగాహన కల్పించటం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించుకునేందుకు యత్నిస్తున్నారు.

ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణతో జోష్‌

ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించడంతో దాని ప్రభావం ఈసారి ప్రవేశాలపై పడేలా ఉంది.  సర్వీసును క్రమబద్ధీకరించుకున్న అధ్యాపకులు ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 132 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 మంది అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే.

అకాడమీలకు అనుమతి లేదు

జిల్లాలో అకాడమీలకు, ట్యూషన్‌ పాయింట్లకు ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతి లేదు. ఇలాంటి సంస్థల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించి నష్టపోవద్దు. అఫిలియేషన్‌ ఉన్న కళాశాలల్లో మాత్రమే విద్యార్థులను చేర్పించాలి.

కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని