logo

తొమ్మిదేళ్లలో పారిశ్రామిక ప్రగతి అద్భుతం: అజయ్‌

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో పారిశ్రామిక రంగం అద్భుత ప్రగతి సాధిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 03:51 IST

సభలో ప్రసంగిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో పారిశ్రామిక రంగం అద్భుత ప్రగతి సాధిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం ఐటీ హబ్‌లో మంగళవారం నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మాట్లాడారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తెలంగాణలో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. తొమ్మిదేళ్లలో 23వేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని, తద్వారా 2,90,000 మందికి ఉపాధి లభించిందని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా టీఎస్‌-ఐపాస్‌ సింగిల్‌ విండో సిస్టంను తీసుకొచ్చి 21 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. గతంలో పరిశ్రమల అనుమతుల కోసం అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఈ పద్ధతి పూర్తిగా తొలిగిపోయిందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో కేరళకు చెందిన కీటెక్‌ కంపెనీ రూ.2వేల కోట్లతో హైదరాబాద్‌లో, ఐ-ఫోన్‌ విడి భాగాలను తయారుచేసే ఫాక్స్‌ కాన్‌ కంపెనీ కొంగర కలాన్‌లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. తద్వారా ఏకకాలంలో లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు.  

కొనియాడే స్థితికి చేరుకొన్నాం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్తు కోతలతో పరిశ్రమలు తరలివెళ్లిపోతాయనే స్థాయి నుంచి ప్రముఖ    సినీనటుడు రజినీకాంత్‌ హైదరాబాద్‌లో పర్యటించి కొనియాడే స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు. నీరు, విద్యుత్తు లేక పరిశ్రమలు మూసేసిన రోజుల నుంచి అన్ని రంగాల్లో సామాన్యులు సైతం పరిశ్రమలు నెలకొల్పి విజయవంతమయ్యారని చెప్పారు. ప్రస్తుతం అన్ని రకాల పరిశ్రమలకు 24 విద్యుత్తు సరఫరాతో పాటు నీటి సౌకర్యం అందిస్తున్నామన్నారు. గ్రానైట్‌ పరిశ్రమను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని, ఖమ్మం జిల్లాకు తలమానికంగా ఉన్న గ్రానైట్‌ పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు క్రేజ్‌ పెరుగుతుందని, గత ఏడాది రూ.1.4 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే ఈ ఏడాది రూ.2.6 లక్షలు పెట్టుబడి రావడం ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

రెండో ఐటీ హబ్‌ ద్వారా 2వేల మందికి ఉపాధి

ఖమ్మం జిల్లా కేంద్రంలో అతి తక్కువ కాలంలోనే ఐటీ హబ్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ అనుమతిచ్చారని తెలిపారు. అద్భుతంగా నిర్మించి ఆయా కంపెనీల్లో రెండు షిఫ్టుల్లో 1,000 మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. రెండో ఐటీ హబ్‌కు సైతం శంకుస్థాపన చేశామని, రూ.35 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలోనే 30 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేలా అందంగా తీర్చిదిద్ది 2,000 మందికి ఉద్యోగాలు అందిస్తామని వెల్లడించారు. రఘునాథపాలెంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌కు 150 ఎకరాల స్థలం కేటాయించామని, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఉత్తమ పారిశ్రామికవేత్తలకు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ తేజో మూర్తులు వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, ఉప మేయర్‌ ఫాతిమా జోహ్రా, డీసీసీబీ, సుడా ఛైర్మన్లు కూరాకుల నాగభూషయ్య, బచ్చు విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, పరిశ్రమలశాఖాధికారి కె.అజయ్‌కుమార్‌, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ గుండాల కృష్ణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

* ద్విచక్రవాహన ప్రదర్శన.. అంతకుముందు వీడీవోస్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయం నుంచి ద్విచక్ర వాహన ప్రదర్శన ద్వారా ఐటీ హబ్‌కు మంత్రి, తదితరులు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని