logo

అత్తమామలు వేధిస్తున్నారని ఆందోళన

భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్తింటివారు వేధిస్తూ, చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రచన అనే మహిళ బోనకల్లులోని తన మామ ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగింది.

Published : 18 Apr 2024 05:43 IST

బోనకల్లు, న్యూస్‌టుడే: భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్తింటివారు వేధిస్తూ, చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రచన అనే మహిళ బోనకల్లులోని తన మామ ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగింది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి బాధితురాలిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన కిల్లా రచనకు 2022, ఫిబ్రవరి 23న బోనకల్లుకు చెందిన బండి సురేశ్‌తో వివాహమైంది. రచన ఖమ్మంలో ఉద్యాన శాఖలో జూనియర్‌ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, సురేశ్‌ ఖమ్మంలో బ్యాటరీల హోల్‌సేల్‌ షాపు నిర్వహించేవాడు. బోనకల్లు నుంచి రోజూ వీరు ఖమ్మం వెళ్లేవారు. ఈ నేపథ్యంలో సురేశ్‌ ఈ నెల 3న అనుమానాస్పద స్థితిలో రైలు కింద పడి చనిపోయాడు. చనిపోకముందు ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.12 లక్షలు, ఎస్‌బీఐ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ విషయమై అతనికి, తండ్రి, సోదరునితో గొడవలు జరుగుతుండేవి. సురేశ్‌ ఆత్మహత్యకు పాల్పడే మూడు రోజుల ముందు కూడా వీరు ఘర్షణ పడ్డారు. భర్త మరణానంతరం రచనను ఆమె మామ యాకోబు, అత్త విజయకుమారి, బావ చిరంజీవి, తోటి కోడలు కృష్ణ ప్రియాంక వేధిస్తున్నారు. ఓసారి హత్యాయత్నానికీ పాల్పడ్డారు. మరోపక్క ఖమ్మంలోని సురేశ్‌ నిర్వహించిన బ్యాటరీ షాపులో రూ.50 లక్షల సరకున్నా, దాని తాళాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త మృతిపై విచారణ చేపట్టాలని, తనకు రక్షణ కల్పించాలని రచన ఫిర్యాదు చేసింది. ఎస్సై మధుబాబు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని