logo

మా కార్యకర్తలూ శక్తిమంతులే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు.

Updated : 05 May 2024 06:38 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు చైతన్యవంతులు
గత మూడు శాసనసభ ఎన్నికల్లో భారాసకు దక్కింది ఒక్కో సీటే
కొత్తగూడెం జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం

సింగరేణి కార్మికుల హెల్మెట్‌ ధరించిన సీఎం

మ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. భాజపా, భారాసపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చైతన్యవంతులు అని, అందుకే గత మూడు పర్యాయాల్లో భారాసను ఒక్కో శాసనసభ స్థానానికే పరిమితం చేశారని కొనియాడారు. ఇక్కడ ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ముఖ్యమంత్రి మాదిరి శక్తిమంతులేనని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో పాటు ఏపీలో విలీనమైన అయిదు గ్రామాలను తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు  రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తుమ్మల, పొంగులేటి, కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి

హస్తం శ్రేణుల్లో కదనోత్సాహం

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మొదటిసారి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రావటంతో ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ శాసనసభ నియోజకవర్గాల నుంచి జనజాతర సభకు పెద్దఎత్తున జనం తరలిరావటంతో నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాలోత్‌ రాందాస్‌నాయక్‌, మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్‌, పిడమర్తి రవి, సీపీఐ నాయకుడు సాబీర్‌పాషా, వక్కలగడ్డ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభకు హాజరైన కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు


మోసానికి చిరునామా కేసీఆర్‌
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

రాష్ట్ర రాజకీయాల్లో మోసానికి చిరునామా కేసీఆర్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలను నమ్మించి కేసీఆర్‌ మోసగించారని విమర్శించారు. సింగరేణి సంపదను కేసీఆర్‌తో పాటు ఆయన హయాంలో పనిచేసిన అధికారులు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీలో విలీనమైన అయిదు గ్రామాలను తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలపటంతో పాటు మణుగూరు- రామగుండం రైల్వేలైన్‌, మైనింగ్‌ విశ్వవిద్యాలయం, పాల్వంచ- కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.


గెలుపు తథ్యం.. తేలాల్సింది ఆధిక్యమే..
రేణుకాచౌదరి, రాజ్యసభ సభ్యురాలు

ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపు తథ్యమని, తేలాల్సిందే ఆధిక్యమేనని ఎంపీ రేణుకాచౌదరి ధీమా వ్యక్తం చేశారు. కరవు కాలంలోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సీఎం రేవంత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.


కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
రఘురాంరెడ్డి, ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలు అమలుచేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ప్రగతి పథంలో ముందుంచుతానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని