logo

బంగారు పర్వదినం

అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు.

Updated : 10 May 2024 06:04 IST

శుభ ముహూర్తంగా అక్షయ తృతీయ

ఖమ్మం బల్లేపల్లి, న్యూస్‌టుడే: అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. పురాణ ఇతిహాసాల్లో అక్షయ తృతీయ ప్రాధాన్యంపై వివిధ అంశాలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ నాడు చేసే కార్యాలు అనంత ఫలితాలనిస్తాయని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఉత్తరాదిన నిర్వహించే ఈ పర్వదినం ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వేడుకగా జరుపుకొంటున్నారు. భిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మార్వాడీ కుటుంబాలతో పాటు తెలుగు కుటుంబాలు అక్షయ తృతీయను ఆనందంగా జరుపుకొంటున్నారు.

శుభముహూర్తంగా భావిస్తూ..

అక్షయ తృతీయను మార్వాడీ కుటుంబాలు వివాహాలకు శుభ ముహూర్తంగా భావిస్తాయి. ఈ రోజున కల్యాణం చేసుకునే వధూవరులు అష్టైశ్వర్యాలుతో అన్యోన్యంగా జీవిస్తారని వారి నమ్మకం. సంవత్సరంలో శుభకార్యాలు చేయడానికి తిథి, వార, నక్షత్రాలకు పండితుడిని సంప్రదించినప్పటికీ అక్షయ తృతీయకు అవేమీ వర్తించవని ఈ రోజే విశిష్ఠమైందని మార్వాడీ పెద్దలు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కొత్తగా వృత్తి, వ్యాపారాలను ఈ రోజున ప్రారంభిస్తే అభివృద్ధి, విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. వేసవికాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు కొంతమంది చలివేంద్రాలు ప్రారంభిస్తారు. ఎండ నుంచి రక్షణకు ఉపయోగపడే పాదరక్షలు, గొడుగు, విసనకర్రలు, నీటితో ఉన్న కుండలను పేదలు, బ్రాహ్మణులకు దానాలుగా ఇస్తారు.
బంగారం,

వస్త్రాల కొనుగోళ్లు..

అక్షయ తృతీయ నాడు బంగారం, వస్త్రాలు కొనుగోలు చేస్తే ఎప్పటికీ కొంటూనే ఉంటామని నమ్మకం ఏడాదికేడాది ప్రజల్లో పెరుగుతోంది. ఈ క్రమంలోనే పలు వ్యాపార సంస్థలు పక్షం రోజుల ముందునుంచే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. మహిళలు ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం నగరాలతోపాటు పలు పట్టణాల్లోని బంగారం దుకాణాల్లో సందడి నెలకొంది. గృహాల్లో లక్ష్మీపూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలు, బంగారం నివేదిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని