logo

1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం.

Published : 10 May 2024 04:36 IST

ములకలపల్లి మండలం జగన్నాథపురంలో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రియాంక అల, అధికారులు

పాల్వంచ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. ఏఏపీసీలు పూర్వ పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల స్థానాన్ని భర్తీ చేస్తాయి. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త కమిటీలకు ఇటీవల ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రతిపాదిత పనులను విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో ఆయా పనులు కొనసాగుతున్నాయి.

ఎంపిక చేసిన పాఠశాలల్లో..

తాగునీరు, విద్యుత్తు సదుపాయం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మరమ్మతులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 753 పాఠశాలలను ఎంపికచేశారు. ఆయాచోట్ల చేసిన ప్రతిపాదనలకు రూ.21.18 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు జరిగిన పనులకు రూ.5.18 కోట్లు విడుదలయ్యాయి. సుమారు 448 పాఠశాలల్లో ఈనెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి    కొత్తగూడెంలో 642 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.20.30 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు     రూ.5 కోట్లు ఖర్చుచేశారు. 249 పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. బూత్‌లు ఏర్పాటు చేసినచోట తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన వంటివి వెంటనే పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. మిగతా చోట్ల తరగతులు పునః ప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తిచేసేలా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదారులు, కమిటీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మండల స్థాయి నోడల్‌ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటే ‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తిచేయాలని విద్యాశాఖ ఆదేశించింది.


మ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకంలో భాగంగా ఎంపికైన బడుల్లో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పోలింగ్‌ బూత్‌లు ఉన్నచోట్ల యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు వసతులు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. మన ఊరు-మన బడి పనులు కూడా పూర్తి చేశాం. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించేలా చూస్తాం.

వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని