logo

ఐటీడీఏలకు రావాలి పూర్వవైభవం

గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్‌ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్‌గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా..

Published : 10 May 2024 04:43 IST

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, ఏటూరునాగారం, భద్రాచలం

గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్‌ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్‌గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా.. వీటిలో ఏటూరునాగారం, భద్రాచలం కేంద్రాలు మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి.’

టీడీఏలు.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు.. కొన్నేళ్లుగా గాడితప్పాయి. వీటి ఫలాలు గిరిపుత్రులకు పూర్తిస్థాయిలో అందటం లేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచేవారు ఐటీడీఏల బలోపేతంపై దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఉప కేంద్రాల ఏర్పాటు అవసరం

భద్రాచలం ఐటీడీఏ నలుగురు, ఏటూరునాగారం ఐటీడీఏ ఆరుగురు కలెక్టర్ల పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ రెండు ఐటీడీఏల విభజన లేదు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మారుమూల ప్రాంతాల్లో అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించింది. గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరిస్తున్నా వాటికి పరిష్కార మార్గం చూపటం లేదు.


మారిన స్వరూపం

భద్రాచలం: రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 29 మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉండేవి. విభజన తర్వాత ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీలో కలిశాయి. 2016లో జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటుతో ఐటీడీఏ స్వరూపం మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు విస్తరించింది. దీని పరిధిలో 32 మండలాలు ఉండటం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం 5.32 లక్షల మంది ఎస్టీ జనాభా ఉంటుంది.
ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఏటూరునాగారం ఐటీడీఏ జిల్లా పునర్విభజనతో దాని పరిధి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు విస్తరించింది. దీని పరిధిలో 75 మండలాలు ఉండగా.. వీటిలో 13 ఏజెన్సీ మండలాలే. 2011 జనాభా లెక్కల ప్రకారం 6.18 లక్షల మంది ఎస్టీ జనాభా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.


ఎంఎస్‌ఎంఈని విస్తృతపరచాలి

ఏటూరునాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలో ప్రస్తుతం సబ్బులు, షాంపులు, నాప్కిన్ల తయారీ, పప్పు మిల్లులను, చిరుధాన్యాలతో పోషకాహారం తయారీ యూనిట్లను నెలకొల్పారు. ఆ ఉత్పత్తుల విక్రయాలు చేపడుతూ ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు. ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధిపై ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఎంఎస్‌ఎంఈ పథకాన్ని విస్తృతపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.


ప్రస్తుత పరిస్థితి

  • వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవటంతో ఆయా విభాగాల వ్యవస్థ పనితీరు పటిష్ఠంగా లేదు. సెక్టార్ల వారీగా ఖాళీలను భర్తీ చేయాలి.
  • పదేళ్లకు ముందు ఐఫ్యాడ్‌, ఎల్‌డబ్ల్యూఈ, డీఆర్పీ, రూరల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం వంటి వాటికి నిధులు బాగా వచ్చేవి. ఇప్పడు పరిస్థితి మారింది. గతంలో మాదిరిగా నిధులు కేటాయిస్తే ప్రజలు గత వైభవాన్ని చూస్తారు.
  • ట్రైకార్‌, సీఎం గిరి వికాసం, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల రూపకల్పన వంటి పథకాలు ఉన్నప్పటికీ నిధులు సరిపడా రావటం లేదు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక శాఖలకు ప్రత్యేక విభాగాలు గతంలో ఉండేవి. ఇప్పుడివి సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి.
  • అటవీ హక్కుల చట్టం కాస్త ఆశాజనకంగా అమలవటంతో గిరిజన రైతులకు కొంత ఉపశమనం లభించింది. పోడు సాగుదారులకు మాత్రం పూర్తిస్థాయిలో పట్టాలు అందలేదు.  బాగా వెనుకబడిన కొండరెడ్ల సంక్షేమానికి సరిపడా నిధులు కావాలి.
  • విద్య విభాగాన్ని విస్తరించాలంటే ఏజెన్సీ డీఈఓ వ్యవస్థ రావాలి. వైద్యపరంగా కొన్నిచోట్ల పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకురావాలి. భద్రాచలం వంటి చోట్ల పీహెచ్‌సీ అప్పుడూ, ఇప్పుడూ లేదు.
  • ఐటీడీఏలోని పథకాల తీరుతెన్నులపై పాలకమండలి మూడు నెలలకోసారి సమీక్షించాలి. అయితే అధికారులు మాత్రం కుదిరినప్పుడు నిర్వహిస్తున్నారు.

అభివృద్ధికి పాటుపడుతా
 పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి

ఎంపీగా గెలిచాక యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తాను. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఇందుకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణానికి చొరవ చూపుతాను.


ఉప కేంద్రాల స్థాపనకు చొరవ
- మాలోత్‌ కవిత, భారాస అభ్యర్థి

జిల్లాల విభజనతో ఐటీడీఏల పరిధి పెరిగింది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వాటి ఉపకేంద్రాల నిర్మాణానికి కృషి చేస్తా. మహిళల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచటంపై దృష్టి సారిస్తాను.


మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏల ఏర్పాటుకు కృషి
అజ్మీరా సీతారాంనాయక్‌, భాజపా అభ్యర్థి

గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు నిధులు తీసుకొచ్చాను. మళ్లీ ఎంపీగా గెలిచాక గత వైభవం తీసుకొస్తా. కొత్త జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీల ఏర్పాటుకు కృషిచేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని