మత్స్య సంపదకు అలివి వల
కృష్ణానదిలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాలకు చెందిన కొందరు కోస్తా, బిహార్ ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించి నిషేధిత అలివి వలలతో వేట కొనసాగిస్తున్నారు.
కృష్ణానదిలో దందా
నిషేధిత వలలతో వేట
పడవలో తరలిస్తున్న అలివి వలలు
నందికొట్కూరు, కొత్తపల్లి, న్యూస్‌టుడే: కృష్ణానదిలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాలకు చెందిన కొందరు కోస్తా, బిహార్ ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించి నిషేధిత అలివి వలలతో వేట కొనసాగిస్తున్నారు. చేప పిల్లలను ఎండు చేపలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మత్స్య కార్మికుల పొట్టు కొడుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్లు తీసుకుని అక్రమ వేటకు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.
ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే
నదిలో మత్స్య సంపదను పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి చేపల పిల్లలు విడుదల చేస్తోంది. అవి అర కిలో బరువు పెరిగిన తర్వాత తీర ప్రాంతంలో లైసెన్సు ఉన్న మత్స్య కార్మికులు పట్టుకోవడానికి అనుమతి ఉంది. కొందరు దళారులు విశాఖపట్నం, ఝార్ఖండ్ నుంచి కూలీలను తీసుకొచ్చి దందా చేస్తున్నారు. సిద్ధేశ్వరం, జానాలగూడెం, బలపాలతిప్ప సరిహద్దు ప్రాంతంలో కూలీలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఏటా డిసెంబరు దందా కొనసాగేది.. ఈ ఏడాది నవంబరులో ప్రారంభించారు.
స్థానిక మత్స్యకారులపై దౌర్జన్యం
నియోజకవర్గంలోని నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా మండలాల పరిధిలో సుమారు 1200 మత్స్యకారుల కుటుంబాలు కృష్ణానదిని నమ్మకుని జీవనం సాగిస్తున్నాయి. వారంతా అలివి వలలతో వేట వద్దని ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఆయా మండలాల్లోని పెత్తందార్లు వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రాజకీయ నాయకుల అండతో వారి నోరు మూయించి అక్రమ దందా సాగిస్తున్నారు.
రాత్రి వేళ తరలింపు
చేపలు ఆరబెడుతున్న మత్స్యకారులు
అలివి వలలకు చిన్న పాటి రంధ్రాలు ఉండటంతో పిల్లలు వలలో పడతాయి. పిల్ల చేపలు ఎండబెట్టి రూ.80 కిలోల చొప్పున చెన్నై, తెలంగాణ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కాస్త పెద్దగా ఉన్న వాటిని కిలో (హోల్‌సేల్) రూ.60 నుంచి రూ.65 అమ్మేస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళ అక్రమ రవాణా చేస్తే ఎవరూ అడ్డుకోవద్దన్న ఉద్దేశంతో పోలీసులకూ డబ్బులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చనిపోతున్నారా.. చంపేస్తున్నారా?
మృతి చెందిన జొన్నకూటి శ్రీను (38)
నందికొట్కూరు, న్యూస్‌టుడే : నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు ఠాణా పరిధిలోని జంగంపాడు సమీపంలో కృష్ణానదిలో సోమవారం మృతదేహం బయటపడింది. చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వలకు అది తలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బయటకు తీయించారు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నానికి చెందిన జొన్నకూటి శ్రీను (38)గా గుర్తించారు. అలివి వలతో చేపలు పట్టేందుకు స్థానిక వ్యాపారులు అతడిని ఇక్కడికి రప్పించినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఒక్కో వ్యక్తికి రూ.లక్ష వరకు అడ్వాన్సు చెల్లించి పలువురిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారంతా వ్యాపారుల కనుసన్నల్లో నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శాతనకోట వద్ద ఉంటున్న ముగ్గురు జాలర్లు అదృశ్యమయ్యారు. వారు స్వగ్రామానికి వెళ్తామని వ్యాపారి వద్ద మొరపెట్టుకున్నా ఆయన స్పందించలేదని.. అంతలోనే ఒకరు నదిలో శవమై తేలడం అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన ఇద్దరు ఎక్కడ ఉన్నారో తేలాల్సి ఉంది. వేటకు నిరాకరించినందుకు చంపి నదిలో పడేశారా? లేక ఆయనే మునిగి చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద, కొత్తపల్లి మండలం జానాలగూడెం వద్ద లభ్యమైన మృతదేహాలు కూడా జాలర్లవే కావడం కలకలం రేపుతోంది. కృష్ణానదిలో లభ్యమైన మృతదేహాల మిస్టరీని పోలీసులు ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి