logo

అతివలకు సాయం.. అంతంతమాత్రం

గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది.

Published : 19 Apr 2024 02:48 IST

ఉనికి కోల్పోతున్న మహిళా సంఘాలు
ఖాతాలకు చేరని సొమ్ము

గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయటంతో పాటు వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదనేది బహిరంగ రహస్యమే. సున్నా వడ్డీకే రుణాలు అనే మాట అసలే అమలుకు నోచుకోవడం లేదు.

ఇదీ పరిస్థితి..

పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ఖాతాలో జమైనట్లు జాబితాలో ఉన్నా.. ఆ మొత్తం అందడం లేదు. పత్తికొండలోని పొదుపు సంఘానికి రూ.16,059 సున్నావడ్డీ జమైనట్లు చూపుతున్నా.. ఒక్క పైసా కూడా జమకాలేదు. మరో గూపునకు సంబంధించి రూ.12,500 చూపుతున్నా.. పొదుపు ఖాతాలో జమకాలేదు. ఓ గ్రూపునకు సంబంధించిన మహిళలు గతంలో రూ.8లక్షలు రుణం తీసుకుంటే రూ.28వేలు సున్నా వడ్డీ జమైంది. ఆ తర్వాత రూ.10లక్షలు రుణం తీసుకున్న అదే సంఘానికి రూ.10వేలు మాత్రం జమైందని సభ్యులు తెలిపారు.  


పశ్చిమాన పచ్చి అబద్ధం

శ్చిమ ప్రాంతంలో ప్రజలు ఏటా వలసబాట పడుతున్నారు. వలసల నివారణకు సీఎం ప్రత్యేక చొరవతో ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఆడా)ని ఏర్పాటు చేశారు. మహిళల జీవనోపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినా అమలుకాలేదు... ఉపాధి లేక మహిళలు వలసబాట పట్టక తప్పడం లేదు.

లక్ష్యం: ఆడా కింద 19 మండలాల్లో 10,159 మంది మహిళల జీవనోపాధుల అభివృద్ధికి రూ.60.49 కోట్లు ఖర్చు చేయాలి.

అమలు: మహిళల జీవనోపాధుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు.


చేయూతకు ఎదురు చూస్తున్నా

- మీసాల మంగమ్మ, దేగలహాలు (చిప్పగిరి)

చిప్పగిరి, న్యూస్‌టుడే: చేయూత పథకం సరిగా అందడం లేదు. మూడు విడతలుగా ఏడాదికి రూ.18,750 వచ్చింది. నాలుగో విడత నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. గ్రామ సచివాలయంలో అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మా గ్రామంలో 45 ఏళ్లు దాటిన చాలా మందికి చేయూత డబ్బు రాలేదు. ప్రభుత్వం ఎన్నికల పేరుతో రూ.18,750 ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇది మహిళలను నమ్మించి మోసం చేయడమే. ఉత్తుత్తి బటన్‌ నొక్కి ఎందుకు మోసం చేయాలి. రాష్ట్ర ఖజానలో డబ్బులు లేవు. మహిళలకు చివరి విడతకు అప్పులు దొరకలేదని చెబితే.. బ్యాంకుల చూట్టు తిరిగే బాధలు తప్పేవి.


అర్హత ఉన్నా.. రాలేదు

- ఆదిలక్ష్మి, తుగ్గలి

తుగ్గలి, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ చేయూత సొమ్ము రాలేదు. పథకానికి సచివాలయంలో దరఖాస్తుతో పాటు అన్ని పత్రాలు అందజేశా. ఐదేళ్ల వైకాపా పాలనలో చేయూత సొమ్ము నేటికీ తీసుకోలేదు. పొదుపు సంఘాలకు ఇచ్చే వైఎస్‌ఆర్‌ ఆసరా సొమ్ము సీఎం బటన్‌ నొక్కిన తరువాత పొదుపు ఖాతాలకు వెంటనే జమ కావడం లేదు ఆలస్యం అవుతోంది. సొమ్ము ఎప్పుడు పడుతుందా అని బ్యాంకుల చుట్టూ మహిళలు, పొదుపు సంఘాల సభ్యులు తిరుగుతున్నాం.


అసలే జమకాలేదు

- మల్లమ్మ, అరేకల్‌, (ఆదోని)

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: చేయూత డబ్బులు పడలేదు. 40 రోజుల కిందట డబ్బులు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కినా.. చాలా మందికి అందని పరిస్థితి. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదు. ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇచ్చారు, స్థలం చూపించలేదు. పలుసార్లు విన్నవించినా స్పందించడం లేదు. ప్రజాప్రతినిధులకు సైతం సమస్య వివరించాం.. పరిష్కారం మాత్రం లభించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని