logo

పింఛను‘దారి’ల కన్నీటి ప్రయాణం

గ్రామీణ ప్రాంతాల్లో  1.40 లక్షల మంది పింఛనుదారులు ఉండగా తొంభై వేల మంది మండల కేంద్రం/ పట్టణానికి వెళ్లాల్సిందే.

Updated : 01 May 2024 05:24 IST

‘‘నా వయస్సు 78 ఏళ్లు. నడుము ఒంగిపోయింది. ఎక్కువసేపు కూర్చోలేను, నడవలేను. మా గ్రామం గోనెగండ్లకు 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటోలో వెళ్లాలంటే రానుపోనూ రూ.60 అవుతుంది.  మా కుటుంబ సభ్యులందరూ పనుల నిమిత్తం ఉదయమే వెళ్లిపోతారు. ఎవరిని  తీసుకెళ్లాలో అర్థం కావడం లేదని  ఎర్రబాడుకు చెందిన మాబున్ని ఆందోళన వ్యక్తం చేశారు.
- న్యూస్‌టుడే, గోనెగండ్ల


‘నా బ్యాంకు ఖాతా తెర్నేకల్‌లోని ఏపీజీబీలో ఉంది. మా ఊరు నుంచి వెళ్లిరావాలంటే 30 కి.మీ. అవుతుంది. పింఛను సొమ్ము తెచ్చుకోవాలంటే మా ఊరికి బస్సు కూడా రాదు. మరొకరి సాయంతో ఆటో తీసుకొని వెళ్లాలి. రూ.100 ఖర్చు అవుతుందని’’ ఐరన్‌బండ బిసెంటర్‌కు చెందిన తరీజ్‌బీ ఆవేదన వ్యక్తం చేశారు.
- న్యూస్‌టుడే, దేవనకొండ


‘‘ఒకటో తారీఖు వచ్చేసరికి.. పండగ దినమైనా.. సెలవు రోజైనా సరే.. సూర్యోదయానికి ముందే చక్కటి చిరునవ్వుతో ప్రతి అవ్వాతాతకు పింఛను అందిస్తున్నాం.. సామాజిక పింఛన్లు రూ.3 వేలు చొప్పున ఇస్తున్నామని’’ డప్పుకొట్టే జగన్‌.. ఓట్ల కోసం పండుటాకులతో పింఛనాట ఆడుతున్నారు.. ఇంటింటికీ పింఛన్లు సులభమైనా ససేమిరా అంటూ బ్యాంకుల చుట్టూ తిరిగేలా కుట్ర పన్నారు. లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా కనిపిస్తోంది. జిల్లాలో చాలా గ్రామాలకు సుదూరంలో బ్యాంకులు ఉంటాయి..బస్సులు అందుబాటులో ఉండవు.. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లాల్సిందే. పింఛన్‌ డబ్బుల కోసం వృద్ధులు గంటల తరబడి ఎర్రటి ఎండలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇదీ పింఛనుదారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కశ వైఖరి. ఈ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టేసే దురాలోచనతో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం


ఎక్కడ ఎన్ని బ్యాంకులు

  • మొత్తం బ్యాంకులు : 269
  • కర్నూలు అర్బన్‌ : 116
  • ఆదోని  : 31
  • కర్నూలు గ్రామీణ  : 10
  • కల్లూరు : 13
  • మిగిలిన ప్రాంతాల్లో : 99

మొత్తం పింఛన్‌దారులు: 2,46,340

  • ఇంటి వద్ద అందుకొనే వారు: 58,244
  •  బ్యాంకులకు వెళ్లాల్సిన వారు
  • గ్రామీణ ప్రాంతాల వారు: 1,40,459
  • పట్టణ ప్రాంతాల వారు: 47,637

గ్రామీణ ప్రాంతాల్లో  1.40 లక్షల మంది పింఛనుదారులు ఉండగా తొంభై వేల మంది మండల కేంద్రం/ పట్టణానికి వెళ్లాల్సిందే.


రెండేళ్లుగా ఖాతా పని చేయడం లేదు
- మద్దిలేటి, గూడూరు

  గూడూరులో ఎస్‌బీఐలో ఖాతా ఉన్నప్పటికీ రెండేళ్లుగా దానిని ఉపయోగించడం లేదు.  ప్రభుత్వం పింఛను సొమ్మును ఖాతాలోకి వేస్తే నా ఖాతా తిరిగి పని చేయడానికి రూ.2 వేలు కోత విధిస్తారు. దీంతో నెలవారి మందులు, ఖర్చులు తీర్చుకునేందుకు ఇబ్బంది అవుతుంది. ఇంటింటికి తెచ్చి పంపిణీ చేయాలి.  


 25 కి.మీ. వెళ్లాలి  
- సుగాలి మునెమ్మ,పరమాన్‌దొడ్డి తండా

మా గ్రామం మాలపల్లికి మజారా. దగ్గర్లో బ్యాంకు లేదు. 25 కి.మీ. దూరంలోని మంత్రాలయం వెళ్లాల్సిందే. మా ఊరు నుంచి 2 కి.మీ. మాలపల్లికి ఆటోలో వెళ్లి, అక్కడి నుంచి మాధవరానికి 15 కి.మీ. మరో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మంత్రాలయానికి 8 కి.మీ. మరో ఆటోలో వెళ్లాలి. మొత్తం 25 కి.మీ. దూరం ప్రయాణించి మంత్రాలయం బ్యాంకుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆటోకు ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తారు. రూ.200 వరకు ఆటో ఛార్జీ అవుతుంది. నాతోపాటు 95 మంది వృద్ధులందరిదీ ఇదే పరిస్థితి.  
- న్యూస్‌టుడే, మంత్రాలయం


రవాణా భారం

జిల్లాలో 25 మండలాల పరిధిలో 482 పంచాయతీలు, 465 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 116 బ్యాంకు శాఖలు. 366 గ్రామ పంచాయతీల్లో, 349 గ్రామ సచివాలయాల పరిధిలో బ్యాంకుల జాడ లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 1.20 లక్షల మంది పింఛనుదారులు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు సగటున 10-30 కి.మీ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు రూ.50-రూ.100 వరకు రవాణా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది.  పింఛన్‌ సొమ్ము కావాలంటే రవాణా, ఇతర ఖర్చులు కలిపి ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ.1.20 కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇదంతా పింఛనుదారులకు భారమే.  

ఆహార ఖర్చు అధనం

పట్టణ ప్రాంతాల్లో పింఛను సొమ్ము కోసం బ్యాంకులకు వెళ్లే వృద్ధులు, వితంతువులు, ఇతరులు నగదు డ్రా చేసుకునేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అసలే వేసవి కాలం.. గొంతు తడారిపోతోంది. తాగునీరు, శీతల పానీయాలు, ,అల్పాహారం కోసం కనీసం ఒక్కొక్కరు రూ.40 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. బ్యాంకులకు వెళ్లి నగదు తెచ్చుకునే లబ్ధిదారులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వెచ్చించే పరిస్థితి ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రయాణాలు చేసి పింఛను సొమ్ము తెచ్చుకునే లక్ష మందిలో 75 శాతానికి పైబడి లబ్ధిదారులు తాగునీరు, శీతల పానీయాలు లేదా కొందరు అల్పాహారం, మరికొందరు భోజనం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికిగాను రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి రూ.అర కోటి వరకు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో హోటళ్లు ఉండవు. ఆ ప్రాంతాల్లో వృద్ధులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి.


జిల్లా దాటి వెళ్లాలి
- లాలెప్ప, నంచర్ల, చిప్పగిరి

మా గ్రామం దౌల్తాపురం సచివాలయం పరిధిలోకి వస్తుంది. చిప్పగిరి 20 కి.మీ. దౌల్తాపురం 18 కి.మీ. దూరం ఉంటుంది. ఈ రెండు గ్రామాల ప్రజలు అనంతపురం జిల్లా గుంతకల్లుకు వెళ్లి అక్కడి నుంచి చిప్పగిరికి రావాలి. రోడ్డు సరిగా లేదు. ప్రయాణానికి అదనంగా రూ.200 ఖర్చు అవుతుంది.
- న్యూస్‌టుడే, చిప్పగిరి


16 కి.మీ ప్రయాణం
- గుత్తి బుడెన్‌బీ, గజ్జహళ్లి, హొళగుంద

గజ్జహళ్లి నుంచి హొళగుందకు 16 కి.మీ. ఎండలో వాహనంలో ప్రయాణించాలంటే చాలా కష్టం. హొళగుంద బ్యాంకుకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. ఆటోలు, ద్విచక్ర వాహనాలే దిక్కు. అదనంగా రూ.100-150 ఖర్చు అవుతుంది. ఆదోనికి వెళ్లాలంటే 30 కి.మీ. ప్రయాణం చేయాలి.
- న్యూస్‌టుడే, హొళగుంద


బ్యాంకు అంటే భయం
- గద్వాల గంగమ్మ, ముచ్చిగేరి, పెద్దకడబూరు  

మా ఇంట్లో నాకు పింఛను వస్తుండగా, భర్తకు రావడం లేదు. మా కుటుంబ సభ్యులంతా వైఎస్సార్‌ జిల్లాకు వలస వెళ్లారు. ముసలివాళ్లం ఇద్దరం ఇంటి వద్ద ఉన్నాం. మా ఇద్దరికీ వయసు మీదపడింది. నా భర్త మంచానికే పరిమితమయ్యాడు.  నాకు పెద్దకడబూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. మా ఊరికి 8 కి.మీ. దూరం అవుతుంది. అక్కడకెళ్లి పింఛను తెచ్చుకోవడం కష్టం. బ్యాంకు అంటేనే భయం.. అక్కడ ఎవరూ స్పందించరు.
- న్యూస్‌టుడే, పెద్దకడబూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని