logo

పర్యాటకం.. జగన్నాటకం

నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది.

Published : 01 May 2024 04:26 IST

 నిధులివ్వని సర్కారు

ఐదేళ్లలో అభివృద్ధి సున్నా

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం: నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది. పర్యాటకుల మదిని దోచుకునే ప్రకృతి అందాలు ఉన్నా ఐదేళ్లుగా నిరాదరణకు గురైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సగటున ఏడాదిలో 40 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, నందవరం చౌడేశ్వరీ దేవి ఆలయాలకు ఎక్కువగా వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు, యాత్రికులతోపాటు రాష్ట్రంలోని పొరుగు జిల్లాలైన వైఎస్సార్‌, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్‌ నుంచి ఎక్కువగా వస్తున్నారు. కానీ యాత్రికులు, భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో పర్యాటకం దెబ్బతింది.

ఆలయాల్లో అరకొర సౌకర్యాలు

సప్తనదుల సంగమం సంగమేశ్వరం క్షేత్రంలో, కొలనుభారతిలోని సరస్వతి ఆలయం సమీపంలో విడతల వారీగా కాటేజీలను నిర్మిస్తే అటు భక్తులతోపాటు ఇటు పర్యాటకుల వసతులు, సౌకర్యాలు కల్పించినట్లు అవుతుంది. ఈ విషయంపై పర్యాటక శాఖ పలుమార్లు ప్రతిపాదనలు పంపినా లాభం లేదు. దీంతో ఈ ఆలయాలకు వచ్చిన భక్తులు త్వరగా దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. ఓర్వకల్లు సమీపంలోని రాక్‌ గార్డెన్స్‌లో, కేతవరం సమీపంలోని ఆదిమానవుడు సంచరించిన ప్రాంతంలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పంపినా పట్టించుకునేవారే కరవయ్యారు. మిడుతూరు సమీపంలోని రోళ్లపాడు బట్టమేక సంరక్షణ వద్ద రిసార్టులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేదు.

శాఖల మధ్య కుదరని సమన్వయం

నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయం వద్ద 10 ఎకరాల స్థలంలో వినోదాన్ని కల్పించే పార్కు నిర్మాణానికి నాలుగేళ్ల కిందట పర్యాటక శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. రూ.100 కోట్ల వ్యయంతో ఇక్కడ రిసార్టు, హోటల్‌, పార్కులతోపాటు ఈతకొలను, బోట్‌ క్లబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థల సేకరణ సమస్యగా మారింది. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని పర్యాటక శాఖకు బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద టూరిస్ట్‌ ప్రాజెక్టు ఏర్పాటు కాలేదు.

అతిథులకు సౌకర్యాలేవీ

- కర్నూలు, నంద్యాల జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చే ప్రజల కనీస సౌకర్యాల కోసం వివిధ ప్రాంతాల్లో రెస్టారెంట్లు, ఆరోగ్య కేంద్రాలు, రిసార్టుల ఏర్పాటుకు పర్యాటక శాఖ చొరవ చూపినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించలేదు.
- పాణ్యం సమీపంలో పర్యాటక రెస్టారెంటుకు 5 ఎకరాలు, సంజామల మండలం నొస్సం గ్రామ సమీపంలో రహదారి పక్కన ఎమ్యూనిటీస్‌ కోసం 5 ఎకరాలు, కొలిమిగుండ్ల మండలం బోయవారిపల్లె దగ్గర 2.5 ఎకరాలు సేకరించినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణాలు జరగలేదు.
- సంగమేశ్వరం క్షేత్రం సమీపంలో కృష్ణా నదిపై నూతనంగా నిర్మించనున్న తీగల వంతెనలో భాగంగా కపిలేశ్వరం వద్ద 10 ఎకరాల్లో రెస్టారెంటు, హెల్త్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.

పశ్చిమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు

కర్నూలు జిల్లాలో టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ వివిధ ప్రాజెక్టులను డిజైన్‌ చేసినా కార్యరూపం దాల్చలేదు. ఆదోనిలో రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ హోటల్‌, వసతి సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటక శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పర్యాటకుల కోసం గార్డెనింగ్‌, రిసార్టులు, రెస్టారెంట్‌ ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలు నాలుగేళ్లుగా దస్త్రాల రూపంలోనే ఉన్నాయి. పెద్దతుంబళం వద్దనున్న జైన్‌ ఆలయాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే గుజరాత్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల పర్యాటకులు వస్తే స్థానికంగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు వ్యాపారపరంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివిధ నిర్మాణాల కోసం రూ.5 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు మూడేళ్ల కిందటే తయారు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. యర్రగుడి దగ్గర అశోకుని శిలా శాసనాలు ఉన్న ప్రాంతాన్ని హెరిటేజ్‌ టూరిజంగా అభివృద్ధి చేయాలని భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకం లేకపోవడంతో ఆగిపోయాయి.

జగన్నాథగట్టు కానరాని ప్రగతి గట్టు

కర్నూలు నగరానికి ఆనుకొని ఉన్న జగన్నాథగట్టును పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ముందుకు సాగడం లేదు. కొండపైన రిసార్టులు, రెస్టారెంట్లు, కాటేజీలు నిర్మించి పర్యాటకులను ఆకట్టుకుంటే.. కొండ పైనున్న రెండు ఆలయాలు అభివృద్ధి చెందుతాయి. జగన్నాథగట్టు నుంచి ఓర్వకల్లు రాక్‌ గార్డెన్స్‌ వరకు ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ మార్గం మధ్యలోనే గార్గేయపురం చెరువు, కేతవరం కొండలు, ఓర్వకల్లు విమానాశ్రయం వంటివన్నీ కలిసిపోయే విధంగా అభివృద్ధి పనులు చేయాలనే ప్రతిపాదనకు కష్టాలు తప్పలేదు.

గుహల నిర్వహణ మరిచారు

బెలూం గుహలను 2002లో అప్పటి తెదేపా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ గుహలకు నెలకు వేలాదిగా యాత్రికులు తరలివస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణను మరిచింది. గుహల లోపలి భాగంలో ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మహానంది క్షేత్రానికి ఏడాది పొడవునా లక్షల్లో యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ వినోదాన్ని కల్పించే పార్కులను ఏర్పాటు చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని