logo

అన్నదాత ఆకలి తీరేనా!

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్‌ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్‌ సహకారంతో మార్కెట్‌ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది.

Published : 01 May 2024 04:34 IST

ఇదే భవనంలో ప్రారంభించాలనుకున్న రైతు రాయితీ భోజన వసతి భవనం
ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్‌ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్‌ సహకారంతో మార్కెట్‌ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్‌ యార్డుకు పంట దిగుబడుల అమ్మకానికి వచ్చే రైతులకు రూ.10లకే భోజనం అందించారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో వడ్డన చేసుకుని అక్కడి నుంచి ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్‌ యార్డులకు భోజనం సరఫరా చేసేవారు. తర్వాత రవాణా కష్టాలు తొలగించాలని ఆదోని యార్డులోనే వంటశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. రూ.లక్షలు వ్యయం చేసి స్ట్రీమ్‌ వంట సామగ్రి, భవనం ఏర్పాటు చేశారు. ఎన్నికలు రావడంతో, అనంతరం వైకాపా అధికారం చేపట్టడంతో వంటశాల ఏర్పాటు పనులు ఆగిపోయాయి.

సెస్సు రూపంలో ఏటా రూ.12 కోట్లు..

 రాయలసీమ ప్రాంతంలోనే అతిపెద్ద మార్కెట్‌ ఆదోని. రాష్ట్రంలో రెండోది. ఏడాదికి రూ.12 కోట్ల దాకా రైతుల పంట దిగుబడుల సెస్సు రూపంలో ఆదాయం సమకూరుతోంది. ఇంతటి యార్డులో పత్తి, వేరుశనగ, పూలవిత్తనాలు, ఆముదాలు తదితర పంట దిగుబడుల అమ్మకాలు సాగుతాయి. ఒక్క సీజన్‌లోనే సరాసరి 50-60వేల మంది దాకా రైతులు భోజనం చేస్తారు. ప్రస్తుతం ధరలు పెంచి రూ.35లు భోజనం అమలు చేస్తున్నారు. ఇందులో రైతు రూ.15, మార్కెట్‌ యార్డు రూ.20లు భరిస్తోంది.

 అలంకారప్రాయంగా వంట సామగ్రి

నాడు తెచ్చి బిగ్గించిన స్ట్రీమ్‌ వంట సామగ్రి నేటికి అలంకారప్రాయంగా మారింది తప్పా... వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో రైతులకు స్థానికంగానే వంట చేసి వడ్డించే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఆదోనిలో వంట చేయడం వల్ల పక్కనే ఉన్న ఎమ్మిగనూరు యార్డుకు సైతం ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు తరలించే సౌలభ్యం ఉంటుంది. దీని వల్ల రవాణ రూపేణ వ్యయభారం తప్పడంతో రైతులకు సకాలంలో భోజన వసతి కల్పించినట్లువుతుంది. తెదేపా అధికారంలోకి వస్తే కాని సమస్యలు తీరేలా కనిపించడం లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని