logo

నగరడోణ.. కల తీరేనా

పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం.

Published : 23 Apr 2024 04:08 IST

ఐదేళ్లుగా నిధుల మాటే లేదు
రైతులకు సాగునీరు అందేనా?

ప్రాజెక్టు కోసం చేపట్టిన కరకట్ట నిర్మాణం

ఆలూరు గ్రామీణ, చిప్పగిరి, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా 0.104 టీఎంసీ సామర్థ్యంతో జలాశయం నిర్మించ తలపెట్టారు. చేసిన పనులకు కూడా నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు.


తండ్రి చేపట్టినా.. తనయుడు మొండిచేయి

నిర్దేశించిన స్థలంలో పెరిగిన ముళ్లకంప

నగరడోణ జలాశయం పరిధిలో ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి మండలాల్లోని 4,632 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని భావించారు. 2008 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.11.58 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి, పనులు దక్కించుకున్న గుత్తేదారు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం 2021లో రూ.53.82 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించింది. కరకట్ట 2.752 కి.మీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో 40 శాతం పనులు మాత్రమే జరిగాయి. చేసిన పనులకు సైతం బిల్లులు చెల్లించక పోవడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.


చెదురుతున్న కరకట్ట

పనులు చేసినా.. నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు కరకట్ట పనులు నిలిపేశారు. దీంతో వర్షా కాలంలో కురిసిన వర్షాలకు కరకట్టపై నుంచి నీరుపారి కోతలకు గురవుతుంది. కట్టపై పిచ్చిమొక్కలు సైతం మొలిచాయి. ఇది ఇలాగే కొనసాగితే పనులు పూర్తయ్యే నాటికి కట్ట మరింత బలహీనమయ్యే ప్రమాదం లేకపోలేదు.


పెరిగిన నిర్మాణ వ్యయం

ప్రాజెక్టు నిర్మాణం 2008లో రూ.11.58 కోట్లతో చేపట్టేందుకు శ్రీకారం చుట్టగా.. దీనిపై పెద్దగా దృష్టిసారించకపోవడంతో అదికాస్త వెనుకబడి పోయింది. 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మరికొంత ప్రాజెక్టు వ్యయం పెంచారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించారు. 2021లో ప్రాజెక్టు వ్యయం ఐదు రెట్లు పెంచి రీ టెండర్‌ పిలిచారు. ఆ సమయంలో మంత్రి, ఆదోని ఎమ్మెల్యే మరోసారి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని