logo

‘చేదోడు’.. జగన్‌ చెడుగుడు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్‌, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు.

Published : 23 Apr 2024 07:01 IST

ఇచ్చినట్లే ఇచ్చి అనర్హత వేటు
ఇష్టారాజ్యంగా లబ్ధిదారుల ఎంపిక

నమ్మించారు

‘‘ పాదయాత్ర పేరిట ఊరూరా తిరిగారు.. బీసీలను బాగు చేస్తానని ప్రగల్భాలు పలికారు.. వెన్నెముక వర్గాలని నమ్మించారు... వెనుకబడిన 21-60 ఏళ్ల వయసున్న వారు ఆర్థికంగా ఎదిగేందుకు ‘చేదోడు’ పథకాన్ని తీసుకొస్తామని జగన్‌  హామీలు కురిపించారు. ’’


వంచించారు

గద్దెనెక్కిన జగన్‌.. అధికారం చేపట్టగానే తొలి దెబ్బ వేశారు. బీసీ ఎదుగుదలకు అత్యంత కీలకమైన కార్పొరేషన్లను ఛిద్రం చేశారు. వృత్తిదారులను కుంగదీశారు. స్వయం ఉపాధి మాటే మరిచారు.. రాయితీ రుణాలకు పాతరేశారు. ఐదేళ్లుగా బీసీలను అడుగడుగునా వంచిస్తున్నారు.


మ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్‌, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. బీసీలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు రాయితీ రుణాలు ఇతోధికంగా సాయపడేవి. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా... స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చి, వారికి దన్నుగా నిలిచేది. వీటిని వినియోగించుకుని వేల బీసీ కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధించి పేదరికాన్ని జయించాయి. ఆర్థిక సాయంపై జగన్‌ దెబ్బ కొట్టారు. అండ లేకుండా చేశారు.

న్యూస్‌టుడే, కర్నూలు సంక్షేమం


సగానికి సగం టోకరా

ఉమ్మడి జిల్లాలో 80 శాతం పేదలు నాయీబ్రాహ్మణులు, రజక కులాల్లో ఉన్నారు. కర్నూలులో జిల్లాలో 13,979 మంది రజకులకు, 9,878 మంది నాయీ బ్రాహ్మణులకే ఆర్థికసాయం అందజేశారు. నంద్యాలలో 24,999 మంది రజకులు, 11,661 మంది నాయీబ్రాహ్మణులకే పథకం కింద లబ్ధి పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలకు దర్జీపని కుటీర పరిశ్రమగా ఉంది. వారెవ్వరికీ ఈ పథకం వర్తించలేదు. కర్నూలు జిల్లాలో 25,957 మంది, నంద్యాల జిల్లాలో 15,008 మంది మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందారు. దుకాణాలు లేవనే కారణంతో వేలాది దరఖాస్తులను పథకం ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. టైలరింగ్‌ వృత్తి పేరుతో దరఖాస్తులు తీసుకుని దుకాణాలు లేవనే పేరుతో తిరస్కరించడంపై ఆ వర్గం ప్రభుత్వంపై గుర్రుగా ఉంది.


నిధులు లేని పదవులు మాకెందుకు

జిల్లా నుంచి వాల్మీకి, కుర్ణి, వీరశైవ, బెస్త కులాలకు ఛైర్మన్‌ పదవులు దక్కగా..వివిధ బీసీ కులాల నుంచి సమారు 30 మందికి డైరెక్టర్‌ పోస్టులు దక్కాయి. వీరు తమ కులాలకు సంబంధించిన పేద వర్గాలకు రుణాలు ఇప్పించుకోలేని పరిస్థితి. నిధులు లేని పదవులు మాకెందుకంటూ పలువురు ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్కొనడం గమనార్హం.


ఏటేటా తగ్గించి.. నిధులు మిగుల్చుకొని

‘జగనన్న చేదోడు’ పథకాన్ని 2020లో ప్రారంభించారు. ఏటా రూ.10 వేల సాయం చేస్తామని చెప్పిన జగన్‌ ఆ తర్వాత సంవత్సరానికి 2021లో ఎలాంటి సాయాన్ని అందించలేదు. ఇదే సమయంలో ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. 2019 నుంచి 2024 వరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇచ్చారు. ఒక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.41,39,40,000లను ఇవ్వకుండా ప్రభుత్వం వంచించింది.

  • తొలి ఏడాది కర్నూలులో 12,191 మంది, నంద్యాలలో 24,540 మందిని పథకానికి ఎంపిక చేశారు. 2021లో సాయం అందించకపోగా 2022లో లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. కర్నూలులో 11,222, నంద్యాలలో 22,701 మందిని తగ్గించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో ఏడాది 2,800 మందిని తప్పించి రూ.2.80 కోట్లను ప్రభుత్వం మిగిల్చింది.

అండగా నిలిచిన తెదేపా

తెదేపా ప్రభుత్వ హయంలో బీసీల కోసం 2014-19 మధ్య ఆదరణ పథకం అమలు చేశారు. బీసీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని తెచ్చారు. కులవృత్తిని బట్టి వారికి పరికరాలను అందజేశారు. స్వయంఉపాధిలో భాగంగా వడ్డెరలకు పలుగు, పార, చేపలు పట్టే వారికి వలలు, యాదవులకు ప్లాస్టిక్‌ పాల డ్రమ్ములు, నాయీబ్రాహ్మణులకు సెలూన్‌ పరికరాలు ఇలా వృత్తుల ఆదారంగా పంపిణీ చేశారు. దీంతో ఆయా వర్గాల వారు స్వయంఉపాధితో ముందడుగు వేసి కుటుంబాలను పోషించుకున్నారు. రూ.వేలల్లో వ్యయం చేసే పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసి కేవలం రెండు కులాలకు మాత్రమే చేదోడు పథకాన్ని అమలు చేసి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంది. ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం కూడా ఇవ్వలేదు. లబ్ధిదారులను కుదిస్తూ పథకాన్ని కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అందరికీ అన్నారు.. కొందరికే పరిమితం

‘జగనన్న చేదోడు’ పథకాన్ని 2020లో ప్రారంభించారు. రజకులు, నాయీబ్రాహ్మణులు, కుట్టు వృత్తిదారులకు ‘జగనన్న చేదోడు’ తెచ్చారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున నాలుగేళ్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దుకాణాలు పెట్టుకుని కులవృత్తి చేస్తున్న రజకులు, నాయీబ్రాహ్మణులకే ఆర్థికసాయం వర్తింపజేశారు. దర్జీ వృత్తి చేసుకుంటున్న అన్ని కులాల వారికి ఈ పథకాన్ని వర్తింపజేసి బీసీల్లోని బెస్త, ఈడిగ, గౌడ, వడ్డెర, యాదవలను తప్పించారు. దీంతో బీసీల్లోని 113 కులాల్లో కేవలం రెండింటికే పథకం ద్వారా ప్రయోజనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల బీసీ కుటుంబాలు ఉండగా కేవలం రెండు కులాల వారికే పరిమితం చేయడంతో సుమారు రూ.2 లక్షల కుటుంబాలు పథకాన్ని అందుకోలేకపోయాయి.


జల్లెడ పట్టి.. కోత పెట్టారు

కొత్తగా 2020లో పథకం అమలు చేసినప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక ఏడాది సాయం అందితే ఐదేళ్ల వరకు ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ రెండో విడతలోనే చాలా మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. విద్యుత్తు బిల్లు 200 యూనిట్లు దాటిందని, నాలుగు చక్రాల వాహనం ఉందని, వార్షిక ఆదాయం పెరిగిందని లబ్ధిదారుల జాబితాను కుదించారు. ఇదే సమయంలో లబ్ధిదారుల పేరు మీదనే దుకాణాలు ఉండాలనే కొత్త నిబంధనను రెండో విడత నుంచే తెచ్చారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నాయీబ్రాహ్మణులు, రజకుల దుకాణాలు ఇతరుల పేర్ల మీద ఉండటంతో చాలా మంది పథకానికి దూరమయ్యారు. చాలా మంది దుకాణాలకు డోర్‌ నంబర్లు లేకపోవడంతో అర్హుల జాబితాలో లేకుండా పోయారు. ఇదే సమయంలో ఇతరుల దుకాణాలను అద్దెకు తీసుకుని నడుపుతున్న చాలామందికి కూడా ప్రభుత్వ సాయం అందలేదు. మరో వైపు ఉమ్మడి జిల్లాలోని 930 గ్రామ పంచాయతీల్లో క్షౌర వృత్తికి సంబంధించి ప్రత్యేకంగా దుకాణాలు అంటూ ఉండవు. ఇదే సమయంలో రజకులు, దర్జీలకు కూడా గ్రామాల్లో ప్రత్యేకంగా దుకాణాలు అంటూ ఉండవు. దుకాణాలు లేవనే పేరుతో చాలా మంది గ్రామీణులను అర్హుల జాబితా నుంచి తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని