logo

జగన్‌ చట్టం.. లోపభూయిష్టం

మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి.

Published : 05 May 2024 02:52 IST

టైటిలింగ్‌ యాక్ట్‌-2022తో ఇక్కట్లు
నాయకుల చేతుల్లోకి రైతుల భూములు

మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి. వీరంతా పలుమార్లు ఆందోళన చేసి రీ సర్వే పనులను అడ్డుకుని హద్దు రాళ్లు నాటకూడదని రైతులు ఆందోళన చేపట్టారు.

పత్తికొండ మండలంలోని చక్కరాళ్ల, పెద్దహుల్తి, దేవనబండ, నలకదొడ్డి, అటికెలగుండు, చిన్నహుల్తి తదితర గ్రామాల పరిధిలోని రీసర్వే పూర్తయిందిన చెబుతున్నా.. ఇంత వరకు రైతులకు పాసుపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. అండగల్‌, 1బీలలో మాత్రం కొంత మంది రైతుల పొలం విస్తీర్ణం తగ్గినట్లు చూపుతున్నాయి.

  • పత్తికొండలోని దూదేకొండ రెవెన్యూ పరిధిలోని దూదేకొండ, కోతిరాళ్ల, కనకదిన్నె, కొత్తపల్లి, జేఎం తండా తదితర గ్రామాల్లో గత మూడు నెలల కిత్రం 9730 ఎకరాల్లో 80శాతం మేర రీసర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా పూర్తిస్థాయి ఆర్‌వోఆర్‌లో నమోదు కాలేదు. పాసుపుస్తకాలు రైతులకు అందలేదు. ఆన్‌లైన్లో విస్తీర్ణం పెరిగినట్లు, తగ్గినట్లు చూపుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

రెక్కలు ముక్కలు చేసుకొని కొన్న భూములు అప్పనంగా లాగేసుకునే పన్నాగం.. వారసత్వంగా వస్తున్న ఆస్తుపాస్తులను స్వాధీనం చేసుకునే స్వార్థం.. చట్టాన్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకునే కుట్ర.. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గట్టు తగాదాలు పెట్టే ఉపాయం.. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను సైతం బద్ధశత్రువులుగా మార్చే మోసం.. భూమి నీదైనా యజమాని తానయ్యేందుకు ఆడుతున్న భూనాటకం. ఇదీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటింగ్‌ యాక్ట్‌-2022) అసలు స్వరూపం. ఈ చట్టంతో పల్లెల్లో ప్రజలు పడుతున్న కష్టాలను ఇలా పంచుకున్నారు.

మాకు భూమి తక్కువ వచ్చింది

మంజునాథ్‌, ఢణాపురం, ఆదోని మండలం

రీ-సర్వే చేయడంతో మాకు భూమి తక్కువ వచ్చింది. 2ఎకరాల 42 సెంట్లు ఉండాల్సిన పొలం 22 సెంట్లు తక్కువగా వచ్చింది. పక్క పొలం నుంచి తీసుకుని క్లియర్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి మార్పు లేదు. ఆన్‌లైన్‌లో మొత్తం భూమి చూపించడం లేదు. గ్రామంలో రైతుల మధ్య వివాదాలు తలెత్తున్నాయి. పలుసార్లు అధికారులకు విన్నవించినా.. పరిష్కరించడం లేదు. క్రయవిక్రయాలు చేయాలన్నా.. ఇబ్బందిగా ఉంది. సమస్య పరిష్కారం కావడం లేదు.

రెవెన్యూకు అధికారం కట్టబెట్టారు

రాజేంద్రప్రసాద్‌, న్యాయవాది, ఆదోని

న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం: భూ హక్కు చట్టంలో రెవెన్యూ వారికి అధికారం కట్టబెట్టారు. ఎలాంటి చట్ట పరిజ్ఞానం లేని అధికారులకు ఇందులో నియమించడం వల్ల పేదలకు నష్టం వాటిల్లుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం న్యాయ వ్యవస్థ. పెండింగ్‌ కేసులు పరిష్కరించేందుకు, న్యాయమూర్తులు తీర్పులు త్వరగా చెప్పడానికి అధిక సఖ్యలో జడ్జీల నియామకం చేపట్టాలి. అలాకాకుండా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ న్యాయ వ్యవస్థను ప్రజలకు దూరం చేసేలా వ్యవరిస్తున్నాయి.  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంతో భూ సమస్యలు పెరిగిపోయాయి. ఇందు కోసం భూ చట్టం తీసుకురావడం దారుణం అన్నారు.

హద్దురాళ్లు ఎక్కడంటే అక్కడ

నాగేశ్‌, కోతిరాళ్ల

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం: ఇద్దరు అన్నదమ్ములకు వచ్చిన 1.20 ఎకరాల్లో సుమారు 40 సెంట్ల విస్తీర్ణం తక్కువగా చూపుతోంది. పైగా సర్వే పేరుతో పాతిన రాళ్లు ఎక్కడ పడితే అక్కడ నాటారు. దీంతో పొలం పక్కన ఉన్న వాళ్లతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఇదేమని అడిగితే 40 సెంట్ల పొలం మీది కాదనీ, పోరంబోకు భూమి మీ పొలంలో కలసినందుకే తొలగించామని అధికారులు సమాధానమిస్తున్నారు. ఉన్న తక్కువ పొలంలో రీ సర్వే పేరుతో పొలాన్ని మాయం చేస్తే రైతులు ఎలా బతికేది.

తహసీల్దారుకు ఫిర్యాదు చేశాం

నరసింహారెడ్డి, బురుజుల (మద్దికెర)

న్యూస్‌టుడే, మద్దికెర: నాకు బురుజులలో సర్వే నెంబర్‌ 215-1సీలో ఒక ఎకరా, 215-2లో 1.90 ఎకరాలు మొత్తంగా 2.90 ఎకరాల భూమి ఉంది. సర్వే చేసిన అనంతరం 22 సెంట్లు తక్కువగా ఉన్నట్లు చూపారు. దీంతో ఒప్పుకోలేదు. తహసీల్దారుకు ఫిర్యాదు చేశాం. ఆపై మా గ్రామంలో 110 మందికి పైగా మాలాంటి బాధిత రైతులు ముందుకొచ్చారు. అధికారులను నిలదీసి సర్వే పనులు అడ్డుకున్నాం. దీంతో మా గ్రామంలో సర్వే పనులు నిలిపివేశారు.

పెద్దల నుంచి వచ్చిన ఆస్తి..

పూల బడేసాబ్‌, తుగ్గలి

న్యూస్‌టుడే, తుగ్గలి: తుగ్గలి రెవెన్యూలో 252 సర్వే నంబర్‌లో ఎకరం పొలం ఉంది. భూసర్వేలో 45 సెంట్ల విస్తీర్ణం మాత్రమే ఉందని పత్రం ఇచ్చారు. పెద్దల నుంచి వచ్చిన ఆస్తిలో ఇప్పుడు తక్కువ చూపడంతో స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాను. మిగతా 65 సెంట్ల భూమి 253 సర్వే నంబర్‌లో ఉందని మండల సర్వేయర్‌ నివేదిక ఇచ్చారు. 253 సర్వే నంబర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం రస్తా, ప్రభుత్వ పొరంబోకు భూమిగా ఉండటం వల్ల నా పేరుపై చేసేందుకు వీల్లేదంటున్నారు. ఆ భూమినే నమ్ముకుని మల్లెతోట సాగు చేస్తూ.. జీవనం సాగుచేసుకుంటున్నా. రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేయకపోతే మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం.

మా పుస్తకంలో జగన్‌ చిత్రం ఎందుకు?

శేషన్న, ఢణాపురం, ఆదోని మండలం

మా గ్రామంలో రీ సర్వే పూఁ్తయింది. పాసుపుస్తకం కూడా ఇచ్చారు. పాసుపుస్తకంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రం ముద్రించారు. మా సొంత భూమికి సంబంధించి దానిపై ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు?. సర్వేనెంబరు 32 బీ1, 32 బీ2 కింద రెండు ఎకరాల మూడు సెంట్లు ఉంది. రీసర్వే చేసిన తర్వాత ఒక ఎకరా 91 సెంట్ల మాత్రమే చూపించారు. 12 సెంట్లు తక్కువ చూపించారు. పక్క పొలం నుంచి వస్తుందని అంటున్నారు. ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. సరిహద్దు రాళ్లు కూడా పాత లేదు. సొంతంగా రూ.200 ఒక రాయి చొప్పున డబ్బులు చెల్లించి రాళ్లు తెచ్చి పాతుకున్నాం.

సర్వే అడ్డుకున్నాం..

అనిమిరెడ్డి, బురుజుల (మద్దికెర)

మా గ్రామంలో సర్వే పేరుతో నాకు 20 సెంట్ల భూమిని తక్కువగా చూపారు. సర్వే నెంబర్‌ 218లో 6.30 ఎకరాల భూమి ఉంది. సర్వే అనంతరం 6.10 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపారు. దీంతో సర్వే వద్దని సంబంధిత సర్వే సిబ్బందిని నిలదీశాం. సర్వే హద్దు రాళ్లు నాటకుండా అడ్డుకున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని