logo

ఓట్ల బాట

గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్‌ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది.

Published : 06 May 2024 03:27 IST

ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం చర్యలు
ఉమ్మడి జిల్లాలో రూ.190 కోట్లతో పనులు

గోనెగండ్ల మండలం అల్వాల నుంచి సి.బెళగల్‌ వరకు వేసిన మట్టి రోడ్డు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్‌ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది. ఆయా ప్రాంతాల్లో త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లపై కొందరు వైకాపా నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా నాణ్యత గాలికొదిలేశారు. తూతూమంత్రంగా పనులు చేసి అయ్యిందనిపిస్తున్నారు.

ఐదేళ్లు గుంతల్లో వదిలేశారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గుంతలు తేలి ప్రయాణించలేని పరిస్థితి. ఐదేళ్ల వైకాపా పాలనలో కనీసం మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. గ్రామీణ రహదారులు మరింత అస్తవ్యస్తంగా మారాయి. పలువురు వాహనదారులు అదుపు తప్పి మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. ఐదేళ్లపాటు కళ్లు మూసుకున్న వైకాపా ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామీణ ఓటర్లకు గాలం వేసేందుకు చర్యలు చేపట్టింది. ‘‘హై ఇంపాక్ట్‌ రోడ్లు’’ పేరుతో గతేడాది రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వానికి అనుకూలమైన ఓ ప్రైవేటు సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి నివేదికలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ‘నాబార్డు‘ నిధులు మంజూరు చేసింది.

మంత్రి నియోజకవర్గానికి ప్రాధాన్యం

  • మంత్రి బుగ్గన ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్‌ నియోజకవర్గంలో రూ.27 కోట్ల వ్యయంతో 5 రహదారులు, ఆళ్లగడ్డ పరిధిలో రూ.26.53 కోట్లతో 6, కోడుమూరులో రూ.25.63 కోట్లతో 4, ఆలూరులో రూ.21.70 కోట్లతో 4, నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో రూ.22.78 కోట్లతో 5 రహదారుల పనులు మంజూరయ్యాయి. డోన్‌ నియోజకవర్గంలో రెండు రహదారులు పూర్తయినప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు.
  • పత్తికొండ నియోజకవర్గంలో రూ.8.10 కోట్లతో 15 కి.మీ. రహదారిని కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారు. ఈ పనుల్లో నాణ్యత కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు రహదారి పనులను తక్కువ ధర (లెస్‌)కు టెండర్లు దక్కించుకున్నారు.
  • బనగానపల్లిలో ఒక్క రహదారికి రూ.18.50 కోట్లు, శ్రీశైలంలో రూ.17.98 కోట్లతో 5 రహదారులు, పాణ్యంలో రూ.7.56 కోట్లతో మూడు, ఎమ్మిగనూరులో రూ.7.32 కోట్లతో 7, నంద్యాలలో రూ.5.85 కోట్లతో 3 రోడ్లు, పత్తికొండలో (మద్దికెర-ఆలూరు వరకు 15 కి.మీ) రూ.8.15 కోట్లతో మంజూరైన రహదారిని గత నెలలోనే హడావుడిగా పూర్తి చేశారు.

అటు ఓట్లు.. ఇటు కమీషన్లు

ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రహదారులు నిర్మించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవడంతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు పర్సంటేజీలు అప్పజెప్పేందుకు అవకాశం ఉంటుందనే ప్రణాళికతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 256 కి.మీ. వరకు 39 రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోడ్లకు సంబంధించి గతేడాది అక్టోబరు 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ ఏడాది జనవరిలో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఒప్పందాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు నెలల కిందట కొన్ని రహదారుల నిర్మాణం ప్రారంభం కాగా.. అధిక శాతం పనులు ఇంకా జరగలేదు.

ఎన్నికల వేళ.. హడావుడి

కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ‘పాలకుర్తి నుంచి మెరుగుదొడ్డి వరకు 12 కి.మీల రహదారికి రూ.4.50 కోట్లతో రహదారి పనులను ఆఘమేఘాలతో చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో రూ.11.85 కోట్ల వ్యయంతో కేజీ రోడ్డు నుంచి కోల్లబావాపురం వయా పూడిచెర్ల, పూడూరు వరకు 14.70 కి.మీల మేర పనులు జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే వేగంగా చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజినీర్లను కొందరు అధికార వైకాపా నేతలు పురమాయిస్తుండటం గమనార్హం. పనులు హడావుడిగా చేస్తుండటంతో నాణ్యత ప్రమాణాలు కానరావడం లేదు. ఫలితంగా ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని